‘కైజాల’లో డిజిటల్‌ చెల్లింపులు

22 Mar, 2018 11:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో డిజిటల్‌ లావాదేవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ కొత్త పేమెంట్‌  సౌకర్యాన్ని అందుబాటులోకి  తేనుంది.  తన సోషల్ నెట్‌వర్కింగ్‌ యాప్‌ ‘కైజాల’లో డిజిటల్ చెల్లింపుల సేవలు ప్రారంభిస్తోంది. తద్వారా దేశీయ వినియోగదారులు వేగంగా డబ్బులు పంపడానికి, లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది. కైజాల యాప్‌ యూజర్ల అభ్యర్థనమేరకు అతి త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామని మైక్రోసాఫ్ట్‌ ఇండియా కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తొలిసారి మొబైల్‌ వాడుతున్న లక్షలాదిమందికి ఇది ఉపయోగ పడుతుందన్నారు.  అలాగే  ముఖ్యంగా  ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ, చిన్నమధ్య తరహా వ్యాపారులకు తమ డిజిటల్‌ చెల్లింపుల సదుపాయం లాభిస్తుందని మైక్రోసాప్ట్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజేష్ ఝా తెలిపారు.

కాగా, గత ఏడాది జూలైలో కైజలా యాప్‌ను  మైక్రోసాఫ్ట్‌  లాంచ్‌ చేసింది. ఎస్‌బ్యాంక్‌, అపోలో టెలీమెడిసన్‌, యునైటెడ్‌ ఫాస్పరస్‌ లిమిటెడ్‌, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ లాంటి సంస్థలతో కీలక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అలాగే పాలనలో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాదాపు 30 ప్రభుత్వ శాఖల్లో కైజాల యాప్‌ను వినియోగిస్తోంది.
 

మరిన్ని వార్తలు