ప్రపంచాన్ని బలోపేతం చేయడమే మైక్రోసాఫ్ట్‌ మిషన్‌: సత్య

13 Feb, 2017 00:34 IST|Sakshi
ప్రపంచాన్ని బలోపేతం చేయడమే మైక్రోసాఫ్ట్‌ మిషన్‌: సత్య

ప్రపంచాన్ని బలోపేతం చేయడమే మైక్రోసాఫ్ట్‌ మిషన్‌ అని వెల్లడి

న్యూయార్క్‌: ప్రపంచాన్ని శక్తిమంతం చేయాలని మైక్రోసాఫ్ట్‌ కోరుకుంటున్నట్టు ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల చెప్పారు. ప్రతీ వ్యక్తీ, ప్రతీ సంస్థ మరింత సాధించేందుకు వీలుగా వారిని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నామని, ఇదే మైక్రోసాఫ్ట్‌ మిషన్‌ అని ఆయన చెప్పారు. దీన్ని పూర్తి చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రతీ ఒక్కరిలా, ప్రతి సంస్థలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన టాండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ విద్యార్థులు, అధ్యాపకవర్గంతో ఇటీవల సత్యనాదెళ్ల సమావేశమయ్యారు.

 మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కంపెనీ పనితీరును మార్చేందుకు తీసుకున్న చర్యలపై ఓ విద్యార్థి నుంచి సత్యకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ... మైక్రోసాఫ్ట్‌ మిషన్‌ గురించి తెలియజేశారు. దీన్ని సాధించేందుకు వైవిధ్యం, సమగ్రత అనేవి చాలా కీలకమని పేర్కొన్నారు. కంపెనీ వ్యాప్తంగా వైవిధ్యం, సమగ్రత అనే సంస్కృతిని అభివృద్ధి చేయాల్సి ఉందని, దీన్ని సాధించేందుకు మైక్రోసాఫ్ట్‌ కష్టించి పనిచేస్తోందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వేర్పాటువాద, వలసవాద వ్యతిరేక విధానాల  నేపథ్యంలో సత్యనాదెళ్ల వైవిధ్యం, కలసి సాగాల్సిన అవసరం గురించి చెప్పడం విశేషం.

>
మరిన్ని వార్తలు