మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులు

13 Mar, 2018 13:34 IST|Sakshi
మైక్రోసాఫ్ట్‌ (ఫైల్‌ ఫోటో)

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీగా పేరున్న మైక్రోసాఫ్ట్‌లో కూడా మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, లింగ వివక్ష ఎక్కువగానే ఉంది. 2010 నుంచి 2016 వరకు లింగ వివక్ష, లైంగిక వేధింపుల కింద 238 ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు తెలిసింది. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు తమపై జరుగుతున్న వేధింపులను, లింగ వివక్షపై చేసిన ఫిర్యాదులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్‌ ప్రతీసారి ఉద్యోగినులకు జీతాల పెంపు, ప్రమోషన్‌ విషయంలో అన్యాయం చేస్తుందని ఈ ఫిర్యాదుల్లో వెల్లడైంది. అయితే ఈ ఫిర్యాదులను మైక్రోసాఫ్ట్‌ ఖండిస్తోంది.

దీనిపై 8 వేల మందికి పైగా ఉద్యోగినులతో ఒక క్లాస్‌ యాక్షన్‌ దావాను కూడా మహిళల తరుఫున వాదించే న్యాయవాదులు ఫైల్‌ చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా సమర్పించిన లీగల్‌ ఫైలింగ్స్‌ మార్చి 12న వెలుగులోకి వచ్చాయి. 238 ఫిర్యాదుల్లో 118 మంది ఫిర్యాదులు లింగ వివక్షకు సంబంధించినవే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులను కంపెనీలు ప్రైవేట్‌గా ఉంచుతాయి. దీంతో ఎన్ని ఫిర్యాదులు వెల్లువెత్తాయో చెప్పడం కూడా కష్టంగా మారుతోంది.  అయితే ఈ విషయంపై స్పందించడానికి మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. ఇంకా క్లాస్‌ యాక్షన్‌ స్టేటస్‌పై అమెరికా జిల్లా జడ్జి జేమ్స్‌ రోబార్ట్‌ కూడా ఎలాంటి తీర్పు ప్రకటించలేదు. మహిళల ఫిర్యాదుల సంఖ్యను సీక్రెట్‌గా ఉంచాలని మైక్రోసాఫ్ట్‌ వాదిస్తోంది. భవిష్యత్తు దుర్వినియోగం అవకుండా చూడాలంటోంది.
 

మరిన్ని వార్తలు