తొలి 6 నెలల్లో పలు ప్రధాన షేర్లు బేర్‌

2 Jul, 2020 13:16 IST|Sakshi

బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో 70 శాతం డౌన్‌

జనవరి-జూన్‌ మధ్యకాలంలో షేర్ల తీరు

జాబితాలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఈఐహెచ్‌

లెమన్‌ ట్రీ హోటల్స్‌, స్పైస్‌జెట్‌, డెల్టా కార్ప్‌

ఇండియన్‌ హోటల్స్‌, ఇండిగో, ఫ్యూచర్‌ రిటైల్‌

ఈ క్యాలండర్‌ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి-జూన్‌)లో పలు బ్లూచిప్‌, మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. ఏస్‌ ఈక్విటీ నివేదిక ప్రకారం బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో సుమారు 70 శాతం షేర్లు నేలచూపులకే పరిమితమయ్యాయి. వీటిలో 21 కౌంటర్లు 50 శాతానికిపైగా పతనంకావడం గమనార్హం. అత్యధికంగా విలువను కోల్పోయిన రంగాలలో రిటైల్‌, క్యాసినో, హోటల్‌, ఎయిర్‌లైన్‌ చోటు చేసుకున్నాయి. జాబితాలో లెమన్‌ ట్రీ హోటల్స్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, డెల్టా కార్ప్‌, స్పైస్‌జెట్‌, ఈఐహెచ్‌ తదిరాలున్నాయి. తొలి ఆరు నెలల్లో లెమన్‌ ట్రీ హోటల్స్‌ షేరు 63 శాతం, ఫ్యూచర్‌ రిటైల్‌ 62 శాతం, డెల్టా కార్ప్‌ 56 శాతం, స్పైస్‌జెట్‌, ఈఐహెచ్‌ 55 శాతం చొప్పున పతనమయ్యాయి.

బౌన్స్‌బ్యాక్‌కు చాన్స్‌
కోవిడ్‌-19 కారణంగా పలు కంపెనీల బిజినెస్‌లు దెబ్బతిన్నట్లు కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవెన్‌ చోక్సీ పేర్కొన్నారు. కార్యకలాపాలు నీరసించడంతో హోటల్‌, ఎయిర్‌లైన్‌ తదితర రంగాల కంపెనీలలో అమ్మకాలు పెరిగినట్లు తెలియజేశారు. అయితే ఈ కంపెనీలు బౌన్స్‌బ్యాక్‌ సాధించేందుకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్‌లో ఫలితాలు నిరాశపరిచే వీలున్నప్పటికీ తదుపరి దశలో బిజినెస్‌లు పుంజుకోవచ్చని తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో బిజినెస్‌లు దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లేనని విశ్లేషించారు. 

ఇదీ తీరు
ఆతిథ్య రంగం విషయానికివస్తే.. పరిస్థితులు వెంటనే రికవర్‌ అయ్యే అవకాశాలు కనిపించడంలేదని విశ్లేషకులు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం లెమన్‌ ట్రీ హోటల్స్‌కు రీసెర్చ్‌ సంస్థ ఐడీబీఐ క్యాపిటల్‌ బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అయితే టార్గెట్‌ ధరలో రూ. 30 నుంచి రూ. 24కు కోత పెట్టింది. ఇక ప్రస్తుత అనిశ్చితుల కారణంగా ఒబెరాయ్‌ హోటళ్ల దిగ్గజం ఈఐహెచ్‌ కౌంటర్‌కు హోల్డ్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. పటిష్ట బ్యాలన్స్‌షీట్‌, దేశంలోని కీలక బిజినెస్‌, లీజర్‌ ప్రాంతాలలో హోటళ్లు వంటి అంశాలు ఈఐహెచ్‌కు బలమని ఈ సందర్భంగా తెలియజేసింది. అయితే కోవిడ్‌-19 కారణంగా ఆతిథ్య రంగంపైనే అధికంగా ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు వివరించింది. కాగా.. తాజ్‌ గ్రూప్‌ హోటళ్ల దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ షేరు సైతం ఈ 6 నెలల్లో 45 శాతం తిరోగమించింది.

ఫ్యూచర్‌ రిటైల్‌ 
ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాలు కొనుగోలు చేయనున్న వార్తలతో ఇటీవల ఫ్యూచర్‌ రిటైల్‌ ర్యాలీ బాటలో సాగుతోంది. తద్వారా ఏప్రిల్‌లో నమోదైన కనిష్టం నుంచి 111 శాతం ర్యాలీ చేసింది. అయినప్పటికీ 2020 ఏడాది తొలి ఆరు నెలల్లో ఈ కౌంటర్‌ 62 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! ఇదే విధంగా చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌, ఇండిగో బ్రాండ్‌ సర్వీసుల ఇంటర్‌గ్లొబ్‌ ఏవియేషన్‌ ఈ కాలంలో 26 శాతం చొప్పున క్షీణించాయి.

ఇండస్‌ఇండ్‌ బేర్‌
ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏకంగా 68 శాతం పతనమైంది. బ్యాంక్‌ వ్యవస్థాపకులు షేర్ల తనఖాపై నిధులు సమీకరించడం, ఆస్తుల(రుణాల) నాణ్యత క్షీణించడం, తక్కువ వ్యయ డిపాజిట్లు మందగించడం వంటి అంశాలు ఈ కౌంటర్‌ను దెబ్బతీస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి చూస్తే ఇండస్‌ఇండ్‌ షేరు రెట్టింపునకుపైగా జంప్‌చేసింది. కాగా.. షేరు ధర- బుక్‌వేల్యూ నిష్పత్తి ప్రకారం 12ఏళ్ల కనిష్టానికి చేరిందంటూ వారం రోజుల క్రితం కిమ్‌ ఎంగ్‌ సెక్యూరిటీస్‌ ఈ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు