టెకీలకు మరో హెచ్చరిక

21 Jun, 2017 19:53 IST|Sakshi
టెకీలకు మరో హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగ ఉద్యోగాల విషయంలో ప్రతిష్టంభన నెలకొన సంగతి తెలిసిందే. ఆటోమేషన్, కొత్త డిజిటల్ టెక్నాలజీస్ పెనుముప్పుగా విజృంభిస్తుండటంతో కంపెనీలు ఉద్యోగులపై భారీగానే వేటు వేస్తున్నాయి. అంతేకాక భవిష్యత్తులోనూ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే దానిపైన గ్యారెంటీ లేదు.  ఈ సవాళ్లు భారత్ కు అతిపెద్ద సవాల్ గా ఉన్నాయని, దేశీయ ఐటీ కంపెనీలు తమ స్టాఫ్ ను రీ-ట్రైన్ చేయడం చాలా కష్టతరమని హెచ్చరికలు వస్తున్నాయి.
 
1.5 మిలియన్ మందిని లేదా ఇండస్ట్రీ వర్క్ ఫోర్స్ లో సగం మందిని రీ-ట్రైన్ చేయాల్సినవసరం ఉందని ఇటీవల ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. కానీ ప్రస్తుతం నాస్కామ్, కన్సల్టింగ్ సంస్థ క్యాప్జెమినీతో కలిసి చేసిన అంచనాల్లో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త స్కిల్-సెట్ లలో మధ్య, సీనియర్ స్థాయి దేశీయ ఐటీ కార్మికులు ఇమడలేరని తెలిపాయి.
 
దీంతో మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో కోత ప్రభావం అధికంగా ఉంటుందని తాజాగా హెచ్చరించాయి. తాను నిరాశాపూరిత విషయాన్ని చెప్పడం లేదని, కానీ ఇది ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని క్యాప్జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చెప్పారు. 60-65 శాతం మంది శిక్షణ పొందలేరని పేర్కొన్నారు. వీరిలో చాలామంది మధ్యస్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకున్న వారేనని తెలిపారు. దీంతో వారు అ‍త్యధికంగా నిరుద్యోగులుగా మారే అవకాశముందని చెప్పారు.  
 
ఐటీ కంపెనీలు కూడా మధ్యస్థాయి ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇచ్చే బదులు ఎక్కువ ప్రతిభావంతులనే తమ కంపెనీలో ఉంచుకోవడానికి మొగ్గుచూపుతాయని పేర్కొన్నారు. మధ్యస్థాయి ఉద్యోగులు కొత్త స్కిల్-సెట్లలో ఇమిడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో వారు ఉద్యోగాల కోత బారిన పడతారని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. తక్కువ స్థాయి స్టాఫ్ కు లేదా కార్మికులకు తేలికగా కంపెనీ రీట్రైన్ చేస్తాయని చెప్పాయి. 
 
>
మరిన్ని వార్తలు