పాలసేకరణలో నంబర్‌వన్ స్థానంపై కేఎంఎఫ్ దృష్టి

17 Jul, 2015 00:31 IST|Sakshi
పాలసేకరణలో నంబర్‌వన్ స్థానంపై కేఎంఎఫ్ దృష్టి

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ విస్తరణ దిశగా అడుగులు
♦ హైదరాబాద్‌లో లీటరు రూ. 34కే నందిని స్పెషల్ టోన్డ్ మిల్క్
♦ హైదరాబాద్‌లో రోజుకు రెండు లక్షల లీటర్ల విక్రయ లక్ష్యం
♦ కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ పి.నాగరాజు
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా పాలసేకరణలో మొదటిస్థానం కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టినట్లు కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉన్న కేఎంఎఫ్ రానున్న కాలంలో దేశీయంగా కూడా ఆ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేఎంఎఫ్ చైర్మన్ పి. నాగరాజు తెలిపారు. ఇందుకోసం ఉత్తరాది మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. నెలరోజుల్లో ముంబై, పూణే నగరాలతో పాటు త్వరలో ఢిల్లీ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రోజుకు 1.49 కోట్ల లీటర్లను సేకరించడం ద్వారా గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ (అమూ ల్ బ్రాండ్) దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాదిన రోజుకు 72 లక్షల లీటర్ల పాల సమీకరణతో కేఎంఎఫ్ మొదటి స్థానంలో ఉంది. ఈ 72 లక్షల లీటర్ల పాలల్లో కేవలం 52 లక్షల లీటర్లను మాత్రమే పాలు పెరుగు, ఇతర ఉత్పత్తులకు వినియోగించగలుగుతున్నామని, మిగిలిన మొత్తాన్ని పాలపొడికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి నందిని స్పెషల్ టోన్డ్ మిల్క్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. 3.5% వెన్నశాతం ఉన్న లీటరు పాలను కేవ లం రూ. 34కే అందిస్తున్నట్లు నాగరాజు తెలిపారు.

 హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి
 ప్రైవేటు కంపెనీలు అధిక ధరకు విక్రయిస్తున్న హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు కేఎంఎఫ్ ప్రకటించింది. నందిని బ్రాండ్ ప్రవేశంతో అన్ని కంపెనీలు పాల ధరలను గణనీయంగా తగ్గించాయని, ఇప్పుడు స్పెషల్ టోన్డ్ మిల్క్ ధరలను తగ్గించడంతో ఈ విభాగంలో కూడా ధరల యుద్ధం మొదలవుతుందన్న అభిప్రాయాన్ని నాగరాజు వ్యక్తం చేశారు. అనతి కాలంలోనే ఇక్కడ నందిని బ్రాండ్‌కు మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే రోజుకు రెండు లక్షల లీటర్ల పాలను విక్రయించే స్థాయికి చేరుకుంటామన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో నందిని బ్రాండ్ తాజా పాలు రోజుకు 75,000 లీటర్లు విక్రయిస్తుంటే, ధీర్ఘకాలం నిల్వ ఉండే గుడ్‌లైఫ్ బ్రాండ్ పాలు 50,000 లీటర్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే ఇక్కడ రూ. 40 కోట్ల వ్యయంతో సొంతంగా రోజుకు 5 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు