మైండ్‌ట్రీ ఆదాయం రూ.1,965 కోట్లు 

15 Jan, 2020 03:00 IST|Sakshi

3 శాతం పెరిగిన నికర లాభం  

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.197 కోట్ల నికరలాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.191 కోట్ల నికర లాభం ఆర్జించామని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ దేబాశిష్‌ చటర్జీ తెలిపారు. 3 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.1,787 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ.1,965 కోట్లకు పెరిగిందని వివరించారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నిర్వహణ లాభ మార్జిన్‌ 2.6 శాతం, నికర లాభం 45 శాతం చొప్పున పెరిగాయని తెలిపారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో 2.8 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం వృద్ధితో 28 కోట్ల డాలర్లకు పెరిగాయని చటర్జీ పేర్కొన్నారు.

గత ఏడాది డిసెంబర్‌ నాటికి చురుకైన క్లయింట్ల సంఖ్య 320గా ఉందని వివరించారు. తమ కంపెనీలో మొత్తం 21,561 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఆట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలస) 17.2 శాతంగా ఉందని తెలిపారు. ఆదాయంలో వృద్ధి సాధిస్తున్నామని, లాభదాయక వృద్ధి సాధించడంపైనా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జూలైలో ఈ కంపెనీని ఎల్‌ అండ్‌ టీ టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మైండ్‌ట్రీ షేర్‌ 2.8% లాభంతో రూ.864 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు