స్టీల్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం!

3 Aug, 2016 01:42 IST|Sakshi
స్టీల్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం!

ఇది టన్నుకు 557 డాలర్లు వరకు ఉండొచ్చు
ఎంఐపీపై కేంద్ర నిర్ణయం స్టీల్ పరిశ్రమకు కీలకం: ఇక్రా

 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలోకి దిగుమతయ్యే పలు స్టీల్ ప్రొడక్ట్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించనుంది. ఇది టన్నుకు 557 డాలర్ల వరకు ఉండొచ్చని తె లుస్తోంది. చైనా, జపాన్, కొరియా, రష్యా, బ్రెజిల్, ఇండోనేసియా దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే అలాయ్/నాన్ అలాయ్ స్టీల్ హాట్ రోల్‌డ్ ఫ్లాట్ ప్రొడక్ట్స్ ధరలు సాధారణ స్థాయి కన్నా తక్కువ గా ఉన్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ అండ్ అలీడ్ డ్యూటీస్ (డీజీఏడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశ ంలోకి వచ్చే పలు స్టీల్ ఉత్పత్తులపై టన్నుకు 474-557 డాలర్ల స్థాయిలో యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇతర దేశాల నుంచి మనకు దిగుమతి అవుతున్న పలు స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలని ఎస్సార్ స్టీల్ ఇండియా, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా డీజీఏడీని ఇదివరకే అభ్యర్థించాయి.

 కేంద్రపు ఎంఐపీ నిర్ణయంపైనే స్టీల్ పరిశ్రమ భవితవ్యం: ఇక్రా
కేంద్ర ప్రభుత్వం కనీస దిగుమతి ధర (ఎంఐపీ) అంశంపై తీసుకోనున్న నిర్ణయంపైనే దేశీ స్టీల్ పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిగులు ఉత్పత్తి, అధిక దిగుమతులు, చౌక ధరలు వంటి అంశాల కారణంగా దేశీ స్టీల్ పరిశ్రమ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపింది. ఎంఐపీని ఆగస్ట్ 5 తర్వాత కొనసాగించాలా? వద్దా? అనే అంశం పరిశ్రమకు చాలా కీలకమని అభిప్రాయపడింది.

విదేశాల నుంచి ఉప్పెనలా వస్తోన్న స్టీల్ దిగుమతులకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్రం ఫిబ్రవరిలో దాదాపు 173 స్టీల్ ఉత్పత్తులపై ఎంఐపీని విధించింది. దీంతో వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్-మే కాలంలో స్టీల్ దిగుమతులు 30 శాతం తగ్గాయని తెలిపింది. అలాగే జూన్ మధ్య నాటికి స్టీల్ ధరలు 25 శాతంమేర పెరిగాయని పేర్కొంది. ఈ చర్యలు స్టీల్ కంపెనీలకు ఊరట కలిగించేవని పేర్కొంది. ఇక ఎంఐపీ కొనసాగింపుపై గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న అస్థిర పరిస్థితుల వల్ల స్టీల్ ధరలు గత నెల రోజుల్లో 8 శాతం మేర క్షీణించాయని తెలిపింది.

మరిన్ని వార్తలు