మెట్రో స్టేషన్ల వద్ద మొబిసీ సైకిల్స్‌!

30 Dec, 2017 01:39 IST|Sakshi

ఓలా, ఉబెర్‌లానే సైకిల్‌ షేరింగ్‌ కోసం యాప్‌

జనవరి నుంచి హైదరాబాద్‌లో మొబిసీ సేవలు

ఐఐటీ హైదరాబాద్‌ సహా పలు ఐటీ కంపెనీలతో డీల్‌

‘స్టార్టప్‌ డైరీ’తో మొబిసీ ఫౌండర్‌ ఆకాష్‌ గుప్తా  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2018 కొత్త సంవత్సరం నుంచి ఓలా, ఉబెర్‌ తరహాలోనే సైకిళ్లనూ అద్దెకు తీసుకోవచ్చు. సైకిలే కదా అని తేలిగ్గా తీసేయలేం. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా వస్తున్న డాక్‌లెస్‌ సైకిల్‌ షేరింగ్‌ యాప్‌ ఇదే. సాధారణంగా సైకిల్‌ అద్దెలు ఎలా ఉంటాయంటే.. నిర్దేశించిన ప్రాంతం నుంచే సైకిల్‌ను అద్దెకు తీసుకోవాలి.

అలాగే కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్‌ చేయాలి. కానీ, మొబిసీలో అలా కాదు.. సైకిల్‌ను ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. వినియోగించాక ఎక్కడైనా పార్కింగ్‌ చేసేయొచ్చు. ఇదే దీని ప్రత్యేకత. జనవరి చివరికల్లా హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లు, ఐఐటీ హైదరాబాద్, పలు ఐటీ కంపెనీల్లో మొబిసీ సైకిల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలను సంస్థ ఫౌండర్‌ ఆకాష్‌ గుప్తా ‘స్టార్టప్‌ డైరీ’కి వివరించారు.

ఎలా వినియోగించాలంటే?
ముందుగా మొబిసీ యాప్‌లో లాగిన్‌ కావాలి. పేరు, ఫోన్‌ నంబరుతో పాటు ఆధార్‌ నంబరును నమోదు చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్‌ను జమ చేశాక... ఫోన్‌ స్క్రీన్‌ మీద దగ్గర్లో ఉన్న సైకిల్స్‌ కనిపిస్తుంటాయి. సైకిల్‌ను ఎంపిక చేసి సైకిల్‌ మీదున్న క్యూఆర్‌ కోడ్‌ను యాప్‌తో స్కాన్‌ చేయగానే సైకిల్‌కు ఉన్న తాళం తెరుచుకుంటుంది.

రైడ్‌ పూర్తయ్యాక ముందుగా చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్‌లో నుంచి చార్జీని మినహాయించి మిగిలిన మొత్తం కస్టమర్‌ పేటీఎం వ్యాలెట్‌లో జమ అవుతుంది. వెంటనే కస్టమర్‌ మొబైల్‌కు ఎంత దూరం ప్రయాణించాం? ఎంత సమయం పట్టింది? ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి? ఎంత కార్బన్‌ను ఆదా చేశాం? వంటి సమాచారమంతా వస్తుంది.

సైకిల్‌ను ఎక్కడ పార్కింగ్‌ చేయాలి?
మొబిసీ పార్కింగ్‌ రెండు రకాలుగా ఉంటుంది. స్థానికంగా ప్రభుత్వం కేటాయించిన నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్‌ చేయవచ్చు. లేదా కంపెనీ నిర్ణయించిన ప్రాంతాల్లో అంటే కళాశాలలు, మెట్రో స్టేషన్లు, ప్రధాన మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్, ఆఫీసులు, జిమ్, పార్క్‌ల వంటి జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబిసీ సైకిళ్లను అద్దెకు తీసుకోవచ్చు. పార్కింగ్‌ చేయనూ వచ్చు.

చార్జీ ఎంత?: ప్రతి రైడ్‌కు అరగంటకు రూ.10 చార్జీ ఉంటుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌కైతే రూ.99. రోజుకు 2 రైడ్లు చేసుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.999 చెల్లించాలి. రైడ్‌ పూర్తయ్యాక  రిఫండ్‌ చేస్తారు. విద్యార్థులకైతే రూ.499 డిపాజిట్‌. ప్రస్తుతం మొబిసీకి 10 వేల మంది యూజర్లున్నారు. రోజుకు 1,000 రైడ్స్‌ జరుగుతున్నాయి.

జనవరి నుంచి హైదరాబాద్‌లో..
‘‘ప్రస్తుతం గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో 500 సైకిళ్లున్నాయి. మరో 10 రోజుల్లో చండీగఢ్, కోల్‌కతా, పుణేల్లో ఒక్కో నగరంలో 150 సైకిళ్లతో సేవలను ప్రారంభిస్తున్నాం. జనవరి చివరికల్లా హైదరాబాద్‌లో మొబిసీ సైకిళ్లను అందుబాటులోకి తెస్తాం. తొలిదశలో 300 సైకిళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ఐఐటీ–హైదరాబాద్, ఎస్‌టీపీఐ, మెట్రో రైల్‌ సంస్థలతో చర్చలు జరిపాం. మొత్తంగా మార్చి నాటికి 5 వేల సైకిళ్లకు చేరాలని లకి‡్ష్యంచాం.

6 నెలల్లో రూ.65 కోట్ల సమీకరణ..
గుర్గావ్‌లో కంపెనీ ప్రారంభించే సమయంలో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇటీవలే అమెరికాకు చెందిన ఈక్విటీ ఇన్వెస్టర్‌ రూ.3.25 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరో 6 నెలల్లో రూ.65 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఒకరిద్దరు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లో సేవలకు కొత్తగా మరో 8 మందిని తీసుకుంటున్నాం’’ అని గుప్తా వివరించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు