మొబీక్విక్‌తోనూ పసిడి కొనుగోళ్లు!

23 Oct, 2018 01:13 IST|Sakshi

పేటీఎం తర్వాత రంగంలోకి మరో ఈ–వాలెట్‌  

న్యూఢిల్లీ: ఇక వినియోగదారులు ఈ–వాలెట్‌ సంస్థ మొబీక్విక్‌ ద్వారా కూడా  డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. పేటీఎం తరువాత ఈ తరహా అవకాశాన్ని మొబీక్విక్‌ కల్పిస్తోంది. తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో టన్ను పసిడి అమ్మకాలు లక్ష్యంగా మొబీక్విట్‌ తాజా అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సేఫ్‌గోల్డ్‌తో మొబీక్విట్‌ జట్లుకట్టింది.

ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్లు పసిడి కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. ఫిజికల్‌ డెలివరీ కూడా తీసుకోవచ్చు.  ఈ తాజా చొరవలో భాగంగా మొబీక్విక్‌ తన యాప్‌పై ‘గోల్డ్‌’ పేరుతో ప్రత్యేక కేటగిరీనీ ఏర్పాటు చేసింది. ‘‘అన్ని రకాల ఆర్థిక సేవలూ అందించాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగానే తాజా చొరవను సంస్థ ప్రారంభించింది. రుణాలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌   తర్వాత సంస్థ ప్రారంభించిన తాజా సేవలు ఇవి’’ అని మొబీక్విక్‌ తెలిపింది.

రూపాయి విలువ నుంచీ...
రూపాయి విలువ  నుంచీ లేదా గ్రాముల్లో 99.5 శాతం ప్యూరిటీ, 24 క్యారెట్‌ గోల్డ్‌ కొనుగోలుకు అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొంది. అలాగే వినియోగదారులు అప్పటికి కొద్ది వారాల నుంచీ పసిడి ధరల ధోరణి ఎలా ఉందో తెలుసుకోడానికీ వీలు కలుగుతుందని మొబీక్విక్‌ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ ఉపాసనా తాకు పేర్కొన్నారు.

ఇది తమకు కీలక వాణిజ్య విభాగంగా మారుతుందన్న అభిప్రాయాన్నీ ఆమె ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఎంఎంటీసీ–పీఏఎంపీ భాగస్వామ్యంతో గత ఏడాది తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రధాన వాటాలున్న పేటీఎం గత ఏడాది పసిడి విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా