మొబైల్ బ్యాంకింగ్ సురక్షితమే..

1 Jun, 2014 00:31 IST|Sakshi
మొబైల్ బ్యాంకింగ్ సురక్షితమే..

 దేశీయంగా మొబైల్ ఫోన్ల వాడకం భారీగా పెరుగుతోంది. 2009-10 నాటితో పోలిస్తే కనెక్షన్ల సంఖ్య 50 శాతం పైచిలుకు పెరిగి ప్రస్తుతం 90 కోట్ల స్థాయిలో ఉంది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య 8.6 కోట్ల స్థాయిలో ఉంది. వివిధ రేట్లలో స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్న నేపథ్యంలో ఇది వార్షిక ప్రాతిపదికన 200 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2015 నాటికి మొబైల్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరుతుందని అంచనా. ఫలితంగా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.
 
 మొబైల్ బ్యాంకింగ్ వల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాంకింగ్ సేవలను పొందడం సాధ్యపడుతోంది. దీని వల్ల బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరం అవ్వడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఉదాహరణకు .. సూపర్ మార్కెట్లోనో, షాపింగ్ మాల్స్‌లోనో ఏదైనా కొన్నారనుకోండి. చెల్లించడానికి మీ అకౌంట్లో తగినంత డబ్బు ఉందో లేదోనని సందేహం వస్తే.. లైన్లో నుంచునే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా డెబిట్ కార్డుతో కొనాలా క్రెడిట్ కార్డును ఉపయోగించాలా అన్నది నిర్ణయించుకోవచ్చు.
 
అలాగే, కరెంటు, వాటరు మొదలైన బిల్లులను ఆఖరు రోజున కూడా అప్పటికప్పుడు, సురక్షితంగా కట్టేసేందుకు మొబైల్ బ్యాంకింగ్ తోడ్పడుతుంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఖాతాల మధ్య నగదును బదిలీ చేసుకోవచ్చు, డిపాజిట్ అయ్యిందా లేదా చూసుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మీకు బ్యాంకులో ఏయే సేవలు లభిస్తాయో.. దాదాపు వాటన్నింటినీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొందవచ్చు. ఈ లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు బ్యాంకులు మొబైల్ అప్లికేషన్స్ (యాప్స్)ని అందిస్తున్నాయి.
 
మొబైల్ బ్యాంకింగ్‌తో ప్రయోజనాలు..
ఇతర మార్గాలతో పోలిస్తే మొబైల్ బ్యాంకింగ్ అనేక ప్రయోజనాలు కల్పిస్తుండటంతో.. దీని వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇంకా పెరుగుతుంది.

 సౌకర్యం: ఖాతా వివరాలు ఎక్కడైనా, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.
 వ్యక్తిగతమైన సేవలు: మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఆయా కస్టమర్ల వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన ఆఫర్లు, పర్సనలైజ్డ్ మెనూ తదితర ఫీచర్స్‌తో సమగ్రమైన సేవలు అందించగలవు.
సురక్షితం: మొబైల్ బ్యాంకింగ్ క్లయింట్ యాప్స్‌కి వెబ్ బ్రౌజర్లతో పనిలేదు. కాబట్టి ఫిషింగ్ స్కాములు ఇతరత్రా సమస్యలకు ఆస్కారం లేదు. పెపైచ్చు ఎంపిన్ (మొబైల్ పిన్ నంబర్), ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) ఫీచర్లతో లావాదేవీలు సురక్షితంగా జరుపుకోవచ్చు.
ఇతర ఉపయోగాలు: మనకు దగ్గర్లో ఉండే ఏటీఎంలు, బ్యాంకు శాఖల వివరాలు..  సమీపంలో షాప్‌లు, మాల్స్ ఇస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్ల సమాచారాన్ని  ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అందిస్తుంటాయి.
 
 మరింత సురక్షితంగా ఉండాలంటే..
   
పాస్‌వర్డ్ టైప్ చేస్తేనే హ్యాండ్‌సెట్ ఆన్ అయ్యేలా సెట్ చేసి ఉంచాలి.
   
మీ పాస్‌వర్డ్, అకౌంటు నంబరు, పిన్ నంబరు, సీక్రెట్ ప్రశ్నలకు జవాబుల సమాచారాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండటమే కాకుండా హ్యాండ్‌సెట్‌లో భద్రపర్చొద్దు.
   
ఫోన్ పోయిన పక్షంలో వెంటనే బ్యాంకుకు లేదా మొబైల్ ఆపరేటరుకు సమాచారం ఇవ్వాలి. ఫోన్ పోగొట్టుకున్నా, లేదా అది దొంగతనానికి గురైనా మొబైల్ ఆపరేటరు.. అది పనిచేయకుండా డిసేబుల్ చేయవచ్చు. అలాగే, దాన్నుంచి మీ ఖాతాలను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా బ్యాంకు కూడా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
   
ఫోన్లో మాల్‌వేర్ (వైరస్‌లు) చొరబడకుండా ముందే గుర్తించి, నివారించే సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఫోన్ పోయిన పక్షంలో .. ఎక్కణ్నుంచైనా లాక్ చేయడానికి, డేటాను డిలీట్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగపడతాయి.
 
పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లో ఎప్పుడూ కూడా స్మార్ట్‌ఫోన్‌తో బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ లావాదేవీలు జరపకుండా ఉండటం మంచిది. అలాగే యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌లు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారాన్ని టైప్ చేయాల్సి వచ్చే అవసరమున్న లావాదేవీల జోలికి కూడా పోకుండా ఉంటే ఉత్తమం.
   
 మొబైల్‌లో బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్నప్పుడు.. అవి పూర్తి కాకుండా ఫోన్‌ను పక్కన పెట్టేసి వెళ్లిపోవద్దు.
 
 మొబైల్ బ్యాంకింగ్ క్రమంగా ఊపందుకుంటున్నా.. ఇప్పటికీ ఇంటర్నెట్ లేదా బ్యాంకుకు స్వయంగా వెళ్లడంతో పోలిస్తే ఇది సురక్షితమేనా అనే సందేహాలున్నాయి. వాస్తవమేమిటంటే.. ఇది కూడా సురక్షితమైనదే. పైగా లావాదేవీలు నిర్వహించాలంటే రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. కస్టమరు మొబైల్ నంబరుతో పాటు వారి మొబైల్ పిన్ నంబరు కూడా అవసరం అవుతుంది. కాబట్టి, ఫోన్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. లాగిన్ అయ్యి, ఆథరైజ్ చేసే దాకా ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్ యాప్‌లో ఇవ్వాల్సిన అవసరం లేనందున హ్యాకర్ల నుంచి సమస్యలు కూడా ఉండవు.

మరిన్ని వార్తలు