ఆఫ్‌లైన్‌లోనూ మొబైల్స్ చౌకే...

28 Nov, 2014 00:57 IST|Sakshi
ఆఫ్‌లైన్‌లోనూ మొబైల్స్ చౌకే...

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ బూమ్ పుణ్యమాని భారత్‌లో ఈ-కామర్స్ వ్యాపారం జోరు మీద ఉంది. భారీ డిస్కౌంట్లు అంటూ కొన్ని ఆన్‌లైన్ కంపెనీలు ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాలు కదపకుండా కూర్చున్న చోటునుంచే కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనే కస్టమర్లు పెరిగిపోతున్నారు. దీంతో  సంప్రదాయ రిటైల్ షాపులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆన్‌లైన్ కంపెనీలకు పోటీగా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో  సింహభాగం కైవసం చేసుకున్న మొబైల్ ఫోన్ల విషయంలోనూ ఇంతే. ప్రముఖ ఆన్‌లైన్ కంపెనీలకు దీటుగా మొబైల్ షాపులు పలు మోడళ్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మధ్య ధరల వ్యత్యాసం కేవలం 5 శాతమేనని మొబైల్ రీసెర్చ్ కంపెనీ 91మొబైల్స్.కామ్ ఇటీవల చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

 కామర్స్ సైట్ల వైపుకు..
 డిస్కౌంట్లపై సాధారణంగా వినియోగదారులు ఆసక్తి కనబరుస్తారు. ఈ అంశమే ఈ-కామర్స్ కంపెనీలకు కలసి వస్తోంది. కొన్ని రకాల ఉత్పత్తులను ఊహించనంత తక్కువ ధరకే విక్రయిస్తున్న పోర్టళ్లు.. భారీ డీల్స్‌ను ప్రకటించినప్పుడు వ్యూహాత్మంగా ముందుకెళ్తున్నాయి. కొన్ని నిమిషాల్లోనే స్టాక్ లేదు (ఔట్ ఆఫ్ స్టాక్) అనే బోర్డు తగిలిస్తున్నాయి.

ఒక ఉత్పాదన దొరక్కపోతే మరో ఉత్పాదనవైపు వినియోగదారులు మళ్లుతారన్నది కంపెనీల భావన. అందుకు తగ్గట్టే డిస్కౌంట్ల వేటలో నెటిజన్లు ఇతర వెబ్‌సైట్లనూ జల్లెడ పడుతున్నారు. తక్కువ ధరకు దొరుకుతున్నాయన్న కారణంగా అవసరం లేని వస్తువులనూ కొనుగోలు చేస్తున్నారు. పోర్టళ్లలో ధరలు గంటగంటకూ మారుతున్నాయి. కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనేముందు బ్రాండ్, ధర పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.

 బెస్ట్ డీల్స్ రిటైల్ షాపుల్లోనూ..
 ఆన్‌లైన్ అనగానే భారీ డిస్కౌంట్లకు దొరుకుతాయన్న ప్రచారం ఉంది. వాస్తవానికి బెస్ట్ డీల్స్‌ను రిటైల్ స్టోర్లు సైతం అందిస్తున్నాయి. దీనికితోడు 100 శాతం విక్రయానంతర సేవ ఔట్‌లెట్ల ప్రత్యేకమని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరమే లేదు. క్షణాల్లో కస్టమర్ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది.

మోడళ్లను స్వయంగా పరిశీలించొచ్చు’ అన్నారు. 15 రోజుల ట్రయల్ పీరియడ్‌లోగనుక ఫోన్ నచ్చకపోతే వెనక్కి ఇచ్చి కొత్తది తీసుకునే అవకాశాన్ని కూడా బిగ్ సి కల్పిస్తోందని చెప్పారు. ఆన్‌లైన్ కంపెనీలు కొన్ని ఉత్పత్తులను మాత్రమే భారీ డిస్కౌంట్లకు ఆఫర్ చేస్తున్నాయని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. ఈ భారీ డీల్‌లో లాభపడేది అతికొద్ది మంది కస్టమర్లు మాత్రమేనని అన్నారు.

>
మరిన్ని వార్తలు