మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్

11 Mar, 2020 18:37 IST|Sakshi

త్వరలో 5-10 రెట్లు పెరగనున్న డేటా ధరలు

టెల్కోల ప్రతిపాదనలకు ట్రాయ్‌  ఓకే చెప్తుందా?

సాక్షి,ముంబై: భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్‌ బిల్లుల మోత మోగనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటాను అనుభవిస్తున్న కస్టమర్లు దాదాపు 10 రెట్ల మేర భారాన్ని భరించాల్సి వుంటుంది. టెలికాం ఆపరేటర్లు కోరిన విధంగా రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయి. ఇది నిజంగా మొబైల్‌ వినియోగారుదారులకు  షాకింగ్‌ న్యూసే.

ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ చందాదారులు  ఒక జీబీ కి రూ. 3.5ల చొప్పున 4జీ డేటా ను పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టెలికాం కంపెనీలు కోరినట్లు ట్రాయ్ నిర్ణయం తీసుకుంటే  మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది. కనీసం 1 జీబీ ధరను రూ.35 గా నిర్ణయించాలని వోడాఫోన్ ఐడియా,  రూ. 30లుగా ఉండాలని, ఎయిర్టెల్, రూ.  20ల కనీస చార్జీగా వుండాలని రిలయన్స్ జియో  ఇప్పటికే ట్రాయ్ కి ప్రతిపాదించాయి.

తాజాగా ఈప్రతిపాదనలకు నీతి  ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్  సానుకూలంగా స్పందించారు.  ఇటీవలి ఏజీఆర్‌ సంక్షోభం​,టెలికాం రంగానికి భారీగా అప్పులు రావడం, ధరలు నిలకడగా తగ్గడం వల్ల ఇంతకుమించి వేరే మార్గం లేదని,అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన  వ్యాఖ్యానించడం గమనార్హం. పరిశ్రమ నుండి వచ్చిన అభ్యర్థన తరువాత కాల్,  డేటా సేవలకు కనీస ధరను నిర్ణయించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)  కూడా  సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కనీస ధరలను పెంచడం వాంఛనీయం కాదని , తిరోగమన దశ అని, ఇది మార్కెట్ పోటీపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పేర్కొంది.

వినియోగదారుల జేబుకు చిల్లు
రోజుకు 2 జీబీ 4జీ డేటా అందించే రూ .599 (84 రోజుల వాలిడిటీ) ప్లాన్‌లో (జీబీకి రూ .3.5 రేటు)  జీబీకి రూ .20-35 పరిధిలో డేటా ధర నిర్ణయిస్తే ఇదే  ప్లాన్‌కు రూ .3,360  రూ. 5,880 మధ్య బాదుడు తప్పదు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా