పండుగ సీజన్‌ : స్మార్ట్‌ఫోన్‌ ధరలపై నిరాశ

15 Aug, 2018 10:50 IST|Sakshi

న్యూఢిల్లీ : పండుగ సీజన్‌లో కస్టమర్లకు నిరాశ కలిగించే విషయం. టర్కీ సంక్షోభం రూపాయి విలువను భారీగా దెబ్బకొట్టగా.. ఇప్పుడు ఆ రూపాయి స్మార్ట్‌ఫోన్‌ ధరలపై ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయిల్లోకి క్రాష్‌ అవడంతో, స్మార్ట్‌ఫోన్‌ కాంపోనెంట్ల ఇన్‌పుట్‌ వ్యయాలు 4 శాతం నుంచి 6 శాతం పెరుగుతున్నాయి. దీంతో  హ్యాండ్‌సెట్‌ తయారీదారులు మొబైల్‌ ఫోన్ల ధరలను సెప్టెంబర్‌ మధ్య నుంచి పెంచనున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయిల్లోకి పడిపోయిన సంగతి తెలిసిందే. క్షీణించిన రూపాయి విలువ వద్ద కొత్త కాంట్రాక్ట్‌ల కోసం సంతకం చేసిన విక్రేతలు అత్యధిక మొత్తంలో నగదును కోల్పోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ధరల పెంపును చేపడతారని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. 

చైనీస్‌ ఆర్‌ఎన్‌బీతో కూడా రూపాయి విలువ 5.4 శాతం క్షీణించింది. ఇది కూడా స్మార్ట్‌ఫోన్‌ ధరలపై ప్రభావం చూపుతుందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు చెప్పారు. కొన్ని బ్రాండ్లు మాత్రమే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులను భారత్‌లో తయారీ చేస్తున్నాయి. కానీ చాలా బ్రాండ్లు బయట మార్కెట్ల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఎక్కువగా చైనా నుంచి వస్తున్నాయి. దీంతో రూపాయి క్షీణత వాటిపై ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ 70కి పడిపోవడం స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఇండస్ట్రి ఇక ధరల పెంపును చేపట్టాల్సి ఉందని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మహింద్రో అభిప్రాయపడ్డారు. 

అయితే డాలర్‌ విలువను ఎప్పడికప్పుడు పరిశీలిస్తున్నామని, ప్రస్తుతమైతే ఎలాంటి ధరల పెంపు ప్రణాళికను లేదని షావోమి తెలిపింది. ఒకవేళ రూపాయి 70 వద్దనే ఉంటే, ఫెస్టివల్‌ సమయంలో కొత్త ఉత్పత్తులపై ధరల పెంపును చేపడతామని పేర్కొంది. దిగ్గజ కంపెనీలు శాంసంగ్‌, ఒప్పో, వివో, లావా, కార్బన్‌, హెచ్‌ఎండీ, ఇంటెక్స్‌, మైక్రోమ్యాక్స్‌ కంపెనీలు మాత్రం స్మార్ట్‌ఫోన్‌ ధరల పెంపుపై ఇంకా స్పందించలేదు. ఆగస్టు నుంచి అక్టోబర్‌ కాలం స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు ఎంతో ముఖ్యమైందని. అన్ని పండుగల సీజన్‌ అప్పుడే. మరి ఈసారి పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు