మొబైల్‌ బిల్లుతో జేబుకు చిల్లు..

20 Jan, 2020 10:08 IST|Sakshi

కోల్‌కతా : దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్‌ ఫోన్‌ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం పడనుంది. యూజర్‌ నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటంతో టెలికాం కంపెనీలు మొబైల్‌ టారిఫ్‌ను మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏజీఆర్‌ చెల్లింపులపై సుప్రీంకోర్టు నుంచి వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లకు ఎలాంటి ఊరట లేకపోవడంతో వనరుల సమీకరణ కోసం కాల్‌ చార్జీల పెంపునకు ఇవి మొగ్గుచూపనున్నాయి. యూజర్‌ నుంచి సగటు రాబడి రూ 180 కంటే తక్కువగా ఉండటం, ప్రపంచ దేశాలతో పోలిస్తే టెలికాంపై వినియోగదారులు వెచ్చించే మొత్తం భారత్‌లో తక్కువే కావడం వంటి అంశాలను పరిశీలిస్తే టెలికాం కంపెనీలు ఈ ఏడాది చివరిలో టారిఫ్‌లను 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు.

కాగా గత నెలలో భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా, రిలయన్స్‌ జియో మూడేళ్లలో తొలిసారిగా కాల్‌ చార్జీలను 14 నుంచి 33 శాతం వరకూ పెంచిన సంగతి తెలిసిందే. టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్‌ను పెంచినా వినియోగదారులు ఇప్పటికీ వారి కమ్యూనికేషన్‌ అవసరాలపై కేవలం 0.86 శాతం మాత్రమే తలసరి ఆదాయం వెచ్చిస్తున్నారని ఇది నాలుగేళ్ల కిందటి మొత్తంతో పోలిస్తే చాలా స్వల్పమని సెల్యులార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మ్యాథ్యూస్‌ అన్నారు. మరోవైపు డేటా అందుబాటులోకి రావడంతో మొబైల్‌ వినిమయం విపరీతంగా పెరిగిన క్రమంలో మొబైల్‌ బిల్లు కొంత అదనంగా చెల్లించేందుకు యూజర్లు వెనుకాడరని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ చెప్పుకొచ్చారు.

చదవండి : జియో షాక్‌..కాల్‌ చేస్తే.. బాదుడే!

మరిన్ని వార్తలు