ప్రస్తుత మొబైల్‌ కస్టమర్లకూ ఆధార్‌ ధ్రువీకరణ

27 Mar, 2017 00:26 IST|Sakshi
ప్రస్తుత మొబైల్‌ కస్టమర్లకూ ఆధార్‌ ధ్రువీకరణ

న్యూఢిల్లీ: మొబైల్‌ వినియోగదారులు అందిరికీ ఆధార్‌ ఈ–కేవైసీ ధ్రువీకరణ తప్పనిసరి కానుంది. కంపెనీలు ఈ–కేవైసీ విధానంలో వేలి ముద్రల ఆధారంగా ఆధార్‌ వివరాలు తీసుకుని కొత్త సిమ్‌లను యాక్టివేట్‌ చేస్తున్నాయి. ఇది ప్రస్తుత మొబైల్‌ కస్టమర్లకు కూడా అమలు కానుంది. అన్ని లైసెన్స్‌డ్‌ కంపెనీలు ప్రస్తుత మొబైల్‌ చందదాదారుల నుంచి ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీ విధానంలో ధ్రువీకరణ తీసుకోవాలంటూ టెలికం శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

చందాదారుల వివరాలను తిరిగి ధ్రువీకరించే విషయమై సుంప్రీకోర్టు ఆదేశాల గురించి కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌లు ద్వారా తెలియజేయాలని, పత్రికలు, టీవీ చానళ్లలో ప్రకటనలు ఇవ్వాలని కోరింది. దీనికి సంబంధించిన వివరాలను తమ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 100 కోట్ల మంది మొబైల్‌ కస్టమర్లకు ఈకేవైసీ ధ్రువీకరణ అమలు చేసే విషయమై చర్చించేందుకు తాము ఈ వారంలోనే సమావేశం అవనున్నట్టు సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) తెలిపింది.

దీనికి తాము మద్దతుగా నిలబడతామని, అయితే ఈ  ప్రక్రియకు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని సీఓఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ చెప్పారు. ఈ–కేవైసీ కంటే ముందు ప్రస్తుత యూజర్లకు కంపెనీలు వెరిఫికేషన్‌ కోడ్‌ను పంపిస్తాయి. ఈ సిమ్‌ వినియోగదారుడి వద్ద అందుబాటులో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకుంటాయి. ఆ తర్వాత ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను చేపడతాయి.

మరిన్ని వార్తలు