దక్షిణాదికి మొబిస్టార్‌ మొబైల్స్‌

3 Aug, 2018 01:21 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల రంగంలో ఉన్న వియత్నాం కంపెనీ మొబిస్టార్‌ దక్షిణాదిన ఆఫ్‌లైన్‌ మార్కెట్లో ప్రవేశించింది. ఇప్పటి వరకు కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రెండు మోడళ్లను విక్రయిస్తోంది. తాజాగా అయిదు రకాల స్మార్ట్‌ఫోన్లను ఆఫ్‌లైన్‌ కోసం అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు రూ.4,000లతో మొదలై రూ.10,500 వరకు ఉందని మొబిస్టార్‌ కో–ఫౌండర్‌ కాల్‌ నో నుయెన్‌ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. అన్ని మోడళ్లు భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసినవని వివరించారు.

హర్యానాలో థర్డ్‌ పార్టీ కంపెనీ వీసన్‌ ప్లాంటులో మొబిస్టార్‌ ఫోన్లు అసెంబుల్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆగ్నేయాసియా, గల్ఫ్‌ దేశాల్లోనూ తమ ఉత్పత్తులు లభిస్తాయని చెప్పారు. వియత్నాంలోని ఆర్‌అండ్‌డీ కేంద్రంలో మోడళ్లు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. 600 మంది పంపిణీదారులతో భారత్‌లో విస్తరిస్తున్నామని వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించడం పెద్ద సమస్య కాదని, నిర్దేశిత ధరలో ఏదేని ఒక మోడల్‌ కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు. దక్షిణాదిన 185 సర్వీస్‌ సెంటర్లను కంపెనీ నిర్వహిస్తోంది.  

మరిన్ని వార్తలు