పన్నుల రాబడి.. లక్ష్యం మించింది

5 Apr, 2017 00:14 IST|Sakshi
పన్నుల రాబడి.. లక్ష్యం మించింది

2016–17లో రూ.17.10 లక్షల కోట్ల ఆదాయం
ప్రభుత్వ లక్ష్యం 16.97 లక్షల కోట్లే


న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో పన్ను వసూళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్‌ సందర్భంగా రూ.16.97 లక్షల కోట్ల పన్ను వసూళ్లను అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం సవరించిన లక్ష్యాన్ని పేర్కొంది. కానీ పన్నుల వసూళ్లు రూ.17.10 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికంగా పన్నుల ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. నికర పన్నుల ఆదాయం 18# అధికంగా రూ.17.10 లక్షల కోట్లు వసూలైందని, గడచిన ఆరేళ్లలోనే ఇది అత్యధికమని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌అధియా అన్నారు.

పన్నుల ఆదాయం ఇలా...
ప్రత్యక్ష పన్ను వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14.2 శాతం పెరిగి రూ.8.47 లక్షల కోట్లుగా నమోదవగా... పరోక్ష పన్నుల ఆదాయం 22 శాతం అధికంగా రూ.8.63 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేట్‌ పన్నుల ఆదాయంలో పెరుగుదల 13.1 శాతం కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో వృద్ధి 18.4 శాతంగా ఉంది. రిఫండ్‌లను పరిగణనలోకి తీసుకుని చూస్తే కార్పొరేట్‌ పన్ను వసూళ్ల ఆదాయంలో నికర వృద్ధి 6.7 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లలో 21 శాతం ఉన్నట్టు తెలుస్తోంది. పరోక్ష పన్ను వసూళ్లలో ఎక్సైజ్‌ పన్నుల ఆదాయం 33.9 శాతం పెరిగి రూ.3.83 లక్షల కోట్లుగా వసూలైంది. సేవా పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం 20.2 శాతం అధికంగా రూ.2.54 లక్షల కోట్లు... కస్టమ్స్‌ వసూళ్లు 7.4 శాతం వృద్ధితో రూ.2.26 లక్షల కోట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు