బంగారంపై సర్జికల్‌ స్ట్రైక్‌? ధర పడిపోతుందా?

30 Oct, 2019 15:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో  సగానికిపైగా చలామణిలో ఉన్న పెద్దనోట్లను రద్దుచేసిన  బీజేపీ సర్కార్‌ తాజాగా మరో సర్జికల్‌ స్ట్రైక్‌కు దాదాపు రంగం సిద్దమవుతోంది. ప్రధానంగా బంగారం వినియోగంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న తరుణంలో ఇది నిజంగానే హాట్‌ టాపిక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం  దేశీయ వినియోగదారుల వద్ద వుండే బంగారంనిల్వపై పరిమితిని విధించేందుకు మోదీ సర్కార్‌ సన్నద్ధమవుతోంది. ఇందుకు ప్రత్యేకంగా గోల్డ్‌ బోర్డును ఏర్పాటు చేయనుంది. దీని ప్రకారం పరిమితికి మించిఎక్కువ బంగారాన్ని కలిగి వుంటే జరిమానా, నిర్దేశిక పన్నును చెల్లించాలి. దీనికి సంబంధించిన విధి, విధానాలపై అధికారంగా పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ...తీవ్ర చర్చకు, ఆందోళనకు దారి తీసింది.

పసిడి ధర దిగి వస్తుందా?
అటు ఆకాశన్నంటున్న ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ధంతేరస్‌ లాంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా పుత్తడి కొనుగోళ్లు పడిపోవడం, సెప్టెంబరు మాసంలో బంగారం దిగుమతి క్షీణించడం లాంటి పరిణామాలు నగల వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నయి. తాజా వార్తలు వాస్తవరూపం దాలిస్తే ఈ దెబ్బకు బంగారం కొనుక్కునే వారే కరువయ్యే అవకాశం ఉందని తులం బంగారం రేటు దారుణంగా పడిపోవడం ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. 

‘పసిడి’ సందేహాలు
ఒకవేళ మధ్యతరగతి కుటుంబాల వద్ద పరిమితికి మించి వుంటే, ఆ మిగిలినదంతా ప్రభుత్వం లాగేసుకుంటుందా? ఇది ప్రధానమైన సందేహం. అసలు బంగారం పరిమితిని ఎలా లెక్కిస్తారు? బంగారం ఎలా సమకూర్చుకున్నారో ప్రభుత్వం అడిగినప్పుడు వివరణ ఇస్తే సరిపోతుందా? వారసత్వంగానో, పుట్టింటినుంచో, బహుమతిగానో, మరో విధంగానో వచ్చే బంగారం పరిస్థితి ఏంటి? పన్నుభారం ఏ మేరకు వుంటుంది?  వీటిన్నిటికి  సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

>
మరిన్ని వార్తలు