బీఎస్‌ఎన్‌ఎల్‌–ఎంటీఎన్‌ఎల్‌ విలీనం

24 Oct, 2019 05:01 IST|Sakshi

68,751 కోట్ల ప్యాకేజీ

భారీ పునరుద్ధరణ ప్రణాళికకు గ్రీన్‌ సిగ్నల్‌

4జీ స్పెక్ట్రం కేటాయింపు, వీఆర్‌ఎస్‌ పథకం

ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియ పూర్తయ్యే దాకా ఎంటీఎన్‌ఎల్‌ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సమావేశం అనంతరం టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్యాకేజీ ప్రకారం రెండు సంస్థల తక్షణ మూలధన అవసరాల కోసం సార్వభౌమ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్లు సమీకరించనున్నారు. ఇక దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు రూ. 29,937 కోట్లతో వీఆర్‌ఎస్‌ పథకం అమలు చేయనున్నారు. రూ. 20,140 కోట్ల విలువ చేసే 4జీ స్పెక్ట్రంను, దానిపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కోసం రూ. 3,674 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది.  

రెండూ కీలక సంస్థలే..
‘బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. ఇవి రెండూ దేశానికి వ్యూహాత్మక అసెట్స్‌ వంటివి. మొత్తం ఆర్మీ నెట్‌వర్క్‌ అంతా బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్వహణలో ఉంది. ఇక 60 ఏళ్లు వచ్చే దాకా కంపెనీలో ఉద్యోగం చేసిన పక్షంలో వచ్చే ఆదాయానికి 125% వీఆర్‌ఎస్‌ కింద అర్హులైన ఉద్యోగులకు ఇచ్చేలా ప్యాకేజీని క్యాబినెట్‌ ఆమోదించింది. తద్వారా.. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీఆర్‌ఎస్‌ స్వచ్ఛందమైనదే. వీఆర్‌ఎస్‌ తీసుకోవాలంటూ ఎవరిపైనా ఒత్తిళ్లు ఉండవు‘ అని ప్రసాద్‌ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో సుమారు 1.68 లక్షల మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 22,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీఆర్‌ఎస్‌ ఎంచుకునే వారిలో 53.5 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు .. మిగిలిన సర్వీసు వ్యవధిలో ఆర్జించే వేతనానికి 125 శాతం మేర లభిస్తుంది. అలాగే 50–53.5 ఏళ్ల వయస్సు గల వారికి మిగిలిన సర్వీసు వ్యవధి ప్రకారం వేతనంలో 80–100 శాతం దాకా ప్యాకేజీ లభిస్తుంది.   

రూ. 40 వేల కోట్ల రుణభారం..
ఈ రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంది. ఇందులో ఎక్కువభాగం.. కేవలం 2 నగరాల్లో (ఢిల్లీ, ముంబై)నే కార్యకలాపాలు సాగించే ఎంటీఎన్‌ఎల్‌దే కావడం గమనార్హం.  4జీ సేవలు అందించేందుకు స్పెక్ట్రం కేటాయించాలంటూ ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. 4జీ సేవలు దశలవారీగా విస్తరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు సుమారు రూ. 10,000 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌కు రూ. 1,100 కోట్లు అవసరమవుతాయని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాష్‌ చెప్పారు. మరోవైపు, రెండు సంస్థలకు ఉన్న రూ. 37,500 కోట్ల అసెట్స్‌ను మూడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మానిటైజ్‌ (విక్రయించడం లేదా లీజుకివ్వం మొదలైన ప్రక్రియలు) చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా