నిత్యావసర వస్తువుల తయారీకి ఆటంకం వద్దు

24 Mar, 2020 02:57 IST|Sakshi

ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలి

పారిశ్రామికవేత్తలకు ప్రధాని సూచనలు

న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాల్లేకుండా చూడాలని పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణ కార్యాచరణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. టెక్నాలజీ సాయంతో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించాలని కోరారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కొంత కాలం పాటు ఉంటుంది. వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడే ఈ సమయంలో ఉద్యోగులను తగ్గించుకోకుండా మానవీయంగా వ్యవహరించాలి.

ఆర్థిక వృద్ధికి ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనూహ్యంగా కోవిడ్‌–19 మహమ్మారి ఎదురైంది. ప్రపంచ యుద్ధ సమయాల్లో కంటే ఎంతో పెద్ద ఎత్తున ఇది సవాళ్లను విసురుతోంది’’ అని ప్రధాని పారిశ్రామికవేత్తలతో అన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ మూలస్తంభం విశ్వాసమేనని ప్రధాని వారికి గుర్తు చేశారు. పలు రంగాల్లో ఈ విశ్వాసం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. పర్యాటకం, నిర్మాణం, ఆతిథ్యం, రోజువారీ జీవనంతో ముడిపడిన అసంఘటిత రంగంపై కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. అసోచామ్, ఫిక్కి, సీఐఐ, 18 రాష్ట్రాల నుంచి స్థానిక వాణిజ్య మండళ్ల ప్రతినిధులు ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు.

ద్రవ్యలోటును సడలించాలి: ఫిక్కి  
ప్రభుత్వం ద్రవ్యలోటుపై ఆందోళన చెందకుండా, లక్ష్యాన్ని 2% పెంచాలని, తద్వారా వ్యవస్థలో రూ.4 లక్షల కోట్లు వస్తాయని ఫిక్కీ ప్రధానికి సూచించింది.  కరోనాపై పోరాటంలో నిత్యావసరాలు, వెంటిలేటర్లు, శానిటైజర్లు, ఔషధాలను తయారీ పెంచేందుకు తమ ప్లాంట్లను కేటాయిస్తామని,  సీఐఐ అభయమిచ్చింది.

>
మరిన్ని వార్తలు