భారత ఆర్థిక మూలాలు పటిష్టం..

27 Jun, 2018 00:17 IST|Sakshi

ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నాం

ఏఐఐబీ సదస్సులో ప్రధాని మోదీ

ముంబై: భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ఆర్థిక క్రమశిక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 7.4 శాతం జీడీపీ వృద్ధితో ప్రపంచ ఎకానమీ వృద్ధికి భారత్‌ చోదకంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) మూడో వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు. ‘చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం నిర్దేశిత శ్రేణికే పరిమితమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది‘ అని ఆయన వివరించారు. స్థూల దేశీయోత్పత్తిలో ప్రభుత్వ రుణ వాటా గణనీయంగా తగ్గుతోందని, చాలా కాలం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థను రేటింగ్‌ ఏజెన్సీలు అప్‌గ్రేడ్‌ కూడా చేస్తున్నాయని మోదీ చెప్పారు. భారత ఆర్థిక పునరుజ్జీవం.. మిగతా ఆసియా దేశాల పరిస్థితులను ప్రతిబింబించేలా ఉంటోందని, ప్రపంచ వృద్ధికి ప్రస్తుతం ప్రధాన చోదకంగా మారిందని తెలిపారు. ‘నవభారతం ఉదయిస్తోంది.

భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లైనా దీటుగా ఎదుర్కొగలగడంతో పాటు అందరికీ ఆర్థిక అవకాశాల కల్పన, సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యాలే పునాదులుగా భారత్‌ ఎదుగుతోంది‘ అని ఆయన చెప్పారు. 2020 నాటికి 40 బిలియన్‌ డాలర్లు, 2025 నాటికి 100 బిలియన్‌ డాలర్ల రుణవితరణ స్థాయికి ఏఐఐబీ ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే ఏఐఐబీ 4 బిలియన్‌ డాలర్ల రుణపరిమాణం ఉండే 25 ప్రాజెక్టులను 12పైగా దేశాల్లో ఆమోదించినట్లు వివరించారు.  

ఇన్వెస్టర్లకు అనుకూల దేశం ..
ఇటు రాజకీయంగాను, అటు స్థూల ఆర్థిక పరిస్థితులపరంగాను భారత్‌లో స్థిరత్వం ఉందని, దీనికి తోడు నియంత్రణ సంస్థల విధానాలు కూడా ఊతమిచ్చేవిగా ఉంటున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు అత్యంత అనుకూలమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు.

దాదాపు 2.6 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉందని, కొనుగోలు శక్తిపరంగా చూస్తే మూడో పెద్ద దేశంగా ఉందని ప్రధాని చెప్పారు. ఈ ఏడాది గ్లోబల్‌ మొబిలిటీ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.  

రక్షణాత్మక విధానాలతో ముప్పు: లికున్‌
కొన్ని సంపన్న దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలపై ఏఐఐబీ ప్రెసిడెంట్‌ జిన్‌ లికున్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ఆయా దేశాలతో పాటు ఇతర దేశాల ఆర్థిక, వాణిజ్య అవకాశాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు