అందమైన వంటిల్లు!

21 May, 2016 04:57 IST|Sakshi
అందమైన వంటిల్లు!

మాడ్యులర్ కిచెన్స్‌ పై పెరుగుతున్న ఆసక్తి

 సాక్షి, హైదరాబాద్: మహిళలు తమ ఇష్టప్రకారం నడిపించే రాజ్యం వంటగది. పిల్లలు అమ్మ నుంచి తాయిలం సంపాదించాలన్నా.. నాన్నకు సిఫారుసులు చేరవేసేలా అమ్మను కాకాపట్టాలన్నా.. కొత్త కోడలు కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవాలన్నా వంట గదే మూలం.  మరి అలాంటి గదిని అందంగా తీర్చిదిద్దడం ఒక కళే. ఆ ఆసక్తిని ఉపాధిగా మార్చుకునేలా చేస్తోంది ‘మాడ్యులర్‌కిచెన్’.

 ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఓ భాగమే కిచెన్ డిజైనింగ్. రానురానూ దీనికి ఆదరణ పెరిగి మాడ్యులర్ కిచెన్ డిజైనింగ్ అనే ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెందింది. ముంబై, ఢిల్లీ, చెన్నైల్లో మనకంటే కాస్త ముందుగానే కిచెన్ డిజైనింగ్ విస్తరించగా హైదరాబాద్, బెంగళూరుల్లోనూ వీటి ఆదరణ పెరుగుతోంది.

మాడ్యులర్ కిచెన్ అంటే..
వంటింట్లోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా తీర్చిదిద్దడమే మాడ్యులర్ కిచెన్. తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులను తీర్చిదిద్ది.. అందంగా ఉండాలని కోరుకుంటున్నారు మహిళలు. అందుకే ఇల్లు పాతదైనా.. కొత్తదైనా.. వంట గదిని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడంతో పాటు అవసరమైనప్పుడు తెరుచుకునేలా, కావాల్సిన వైపుకు తిప్పుకునేలా మాడ్యులర్ కిచెన్‌లో ర్యాకులుంటాయన్నమాట. చిన్న చిన్న వస్తువులకు కూడా హైరానా పడకుండా అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తారు.

 బడ్జెట్‌ను బట్టి..
ఇందుకోసం ముందుగా తయారీ విడి భాగాలతో ఒక నమూనా తయారు చేస్తారు. కేటాయించిన స్థలం, ఖాతాదారుడి బడ్జెట్‌పై వీటి తయారీ ఆధారపడి ఉంటుంది. వంటగదికి కేటాయించిన స్థలాన్ని అంచనావేసి, దానికి అనుగుణంగా విడిభాగాలను సేకరించి వంటగదిలో అమర్చుతారు. తక్కువ స్థలంలో ఇముడుతూ, ఎక్కువ అందంగా వంటగది కనిపించేలా చూడటమే డిజైనర్ పని. మన ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగానే మాడ్యులర్ కిచెన్స్‌లోనూ పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వంటింట్లోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా అందంగా రూపుదిద్దుతున్నారు.

వీటి ధరలు రూ.10 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాడ్యులర్ కిచెన్స్ నుంచి పొగ బయటకు రాదు. పాతకాలంలో పొయ్యి మీద పొగ గొట్టాలున్నట్లుగానే ఉంటాయి. కానీ ఇవి అధునాతనంగా ఉంటాయి. దీంతో పాటు వంట సామాగ్రి  చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. లిమెన్స్ కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల పేర్లతో మన అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక అరలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును మోసేలా ఉంటుంది. వీటికి వేడి తగిలినా.. నీటిలో తడిచినా ఏమాత్రం చెక్కుచెదరవు.

స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com

మరిన్ని వార్తలు