లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే 

25 Aug, 2019 01:42 IST|Sakshi

సాక్షి, బిజినెస్‌ బ్యూరో : రియల్టర్లు లాభాలతోపాటు విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించాలని ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) అసోసియేట్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌ సూచించారు. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ (ఎన్‌ఏఆర్‌) ఇండియా 11వ కన్వెన్షన్‌ శనివారమిక్కడ ప్రారంభమైంది. ‘గేమ్‌ చేంజర్‌’థీమ్‌తో నిర్వహిస్తున్న రెండు రోజుల ఈ సదస్సుకు సాక్షి గ్రూప్‌ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. మహ్మద్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌ సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదేదీ ఉండదని, తాను జీవితంలో ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నానని తెలిపారు. దేశంలోనే నాల్గవ అతిపెద్ద సంస్థ అయిన పీడబ్ల్యూసీ ఇండియా కంపెనీలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికి 12 సార్లు 10 కే మారథాన్‌లో పాల్గొన్నానని, 20కే మారథాన్‌లో పాల్గొనాలనేది లక్ష్యమని తెలిపారు.

సంస్థ ఎదుగుదలలో హైదరాబాద్‌ పాత్ర 
ఎన్‌ఏఆర్‌ ఇండియా చైర్మన్‌ రవివర్మ మాట్లాడుతూ ఎన్‌ఏఆర్‌ ఇండియా రియల్టీ పరిశ్రమలోని రియల్టర్లు, స్టేక్‌ హోల్డర్స్, ఏజెంట్ల గొంతును సమాజానికి వినిపించే సారథిగా పనిచేస్తుందని, పరిశ్రమ  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందుంటుందని తెలిపారు. రెరా చట్టం తీసుకురావడంలో నార్‌ ఇండియా ముఖ్య భూమిక పోషించిందన్నారు. ఎన్‌ఏఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఇర్షాద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ స్థూల జాతీయోత్పత్తిలో రియల్‌ ఎస్టేట్‌ వాటా 17–18% ఉంటుందన్నారు. దీనిపై 250కి పైగా అనుబంధ కంపెనీలు ఆధారపడి ఉన్నాయని, వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించేది నిర్మాణ రంగమేనన్నారు. నివాస, వాణిజ్య సముదాయాలతోపాటు కో–లివింగ్, కో–వర్కింగ్, వేర్‌హౌసింగ్‌ విభాగాలకు డిమాండ్‌ పెరుగుతోందని, రియల్టర్లు వాటిపై దృష్టి సారించాలని సూచించారు. 

ఎన్‌ఏఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాదీ
2019–20 ఏడాదికి గాను ఎన్‌ఏఆర్‌ ఇండియా ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌కు చెందిన రియల్టర్‌ సుమంత్‌ రెడ్డి అర్నాని నియమితులయ్యారు. హైదరాబాద్‌ రియల్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ఏ) హోస్టింగ్‌గా వ్యవహరించిన దీనిలో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రెడాయ్‌) , నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి 1,500 మంది రియల్టర్లు పాల్గొన్నారు. ఎన్‌ఏఆర్‌ ఇండియాలో 16 రాష్ట్రాల్లో 48 చాప్టర్లలో 30 వేలకు పైగా సభ్యులున్నారు. 

మరిన్ని వార్తలు