‘జన ధన’కు కాసుల కళ..

14 Jul, 2016 00:59 IST|Sakshi
‘జన ధన’కు కాసుల కళ..

తగ్గుతున్న జీరో బ్యాలెన్స్ అకౌంట్లు
దేశవ్యాప్తంగా దాదాపు రూ. 40 వేల కోట్ల డిపాజిట్లు
తెలుగు రాష్ట్రాల్లో డిపాజిట్లు రూ. 1,916 కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రధానమంత్రి జన ధన యోజన (జేడీవై) క్రమంగా ఆదరణ చూరగొంటోంది. దీంతో జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గతేడాది జనవరిలో 67 శాతంగాను,  ఆగస్టులో దాదాపు 45 శాతంగానూ ఉన్న ఈ తరహా ఖాతాల సంఖ్య ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి సుమారు సగం తగ్గి.. 25.29 శాతం స్థాయికి చేరింది. గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 22.37 కోట్ల ఖాతాలు ప్రారంభించగా .. వీటిలో రూ. 39,939 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. బ్యాలెన్స్ విషయంలో రూ. 31,409 కోట్లతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందు ఉండగా, ప్రైవేట్ బ్యాంకుల్లో 1,498 కోట్లు ఉన్నాయి. మిగతా రూ. 7,000 కోట్ల వాటా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులదిగా ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమయ్యేందుకు ఆసక్తి కనపరుస్తున్నరనడానికి నిదర్శనంగా.. సదరు ఖాతాల్లో డిపాజిట్ల పరిమాణం సైతం పెరుగుతోంది. 2014 ఆఖర్లో సుమారు రూ. 795గా ఉన్న సగటు డిపాజిట్ పరిమాణం ఈ ఏడాది మే నాటికి 118 శాతం పెరిగి రూ. 1,735కి చేరింది.

 మారుమూల ప్రాంతాల్లో పేదవారు కూడా బ్యాంకుల మాధ్యమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2014 ఆగస్టులో జన ధన యోజన పథకం ప్రారంభమైంది. మినిమం బ్యాలెన్స్‌ల బాదరబందీ లేకుండా ఉచితంగానే ఈ ఖాతాను తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన వారికి లావాదేవీల నిర్వహణను బట్టి దాదాపు రూ. 5 వేల దాకా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, బీమా కవరేజీ మొదలైనవి కల్పించడం ఈ పథకం ప్రత్యేకత. అయితే, జేడీవై ఖాతాల ద్వారా వేల కోట్లు వచ్చినప్పటికీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కల్పించే విషయంలో బ్యాంకులు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి జేడీవై ఖాతాదారులు దాదాపు రూ. 272 కోట్ల ఓడీ మొత్తాన్ని పొందారు. 

 తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల ఖాతాలు ..
రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇప్పటిదాకా తెలంగాణలో మొత్తం 79,85,430, ఆంధ్రప్రదేశ్‌లో 74,96,066 అకౌంట్లు ఉన్నాయి. తెలంగాణ ఖాతాల్లో రూ. 959 కోట్లు, ఏపీ ఖాతాల్లో రూ. 957 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. దేశం మొత్తం మీద జీరో బ్యాలెన్స్ ఖాతాలు  సగటున 25 శాతంగా ఉండగా.. తెలంగాణలో 31 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 24 శాతం స్థాయిలో ఉన్నాయి. జన ధన ఖాతాల ప్రయోజనాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుతుండటం ఈ అకౌంట్లలో బ్యాలెన్స్‌లు మెరుగుపడుతుండటానికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) చైర్మన్ వి. నరసి రెడ్డి తెలిపారు. అలాగే, ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా వివిధ సబ్సిడీల మొత్తాలను జన ధన ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చే స్తుండటం కూడా మరో కారణమని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు