మళ్లీ స్విస్‌ బ్యాంకులు గలగల..

28 Jun, 2018 19:56 IST|Sakshi

జ్యురిచ్‌/న్యూఢిల్లీ : స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచిన సొమ్ము 2017లో 50 శాతం పెరిగి రూ 7000 కోట్లకు చేరింది. గత మూడేళ్లలో స్విస్‌ బ్యాంకుల్లో నల్లకుబేరులు దాచిన సొమ్ము తగ్గుతూ వస్తున్న క్రమంలో గత ఏడాది ఏకంగా 50 శాతం పెరగడం గమనార్హం. బ్లాక్‌ మనీ నిరోధంపై కేంద్రం ప్రకటించిన పలు చర్యల నేపథ్యంలో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచే మొత్తం పెరిగిందని భావిస్తున్నారు.

2017లో విదేశీ ఖాతాదారులు దాచిన నిధుల మొత్తం గణనీయంగా పెరిగి మొత్తం నిల్వలు రూ 100 లక్ష కోట్లకు పెరిగాయని స్విస్‌ జాతీయ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) విడుదల చేసిన అధికారిక వార్షిక గణాంకాలు వెల్లడించాయి. కాగా స్విస్‌ బ్యాంక్‌ సహా విదేశీ బ్యాంకుల్లోనూ నల్లకుబేరులు దాచిన మొత్తాలపై భారత్‌ ఉక్కుపాదం మోపిన క్రమంలో భారత్‌ నుంచి స్విస్‌ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

2016లో స్విస్‌ బ్యాంకుల్లో భారత కుబేరులు దాచిన మొత్తం 45 శాతం పతనమైన విషయం తెలిసిందే. కాగా నల్లధనంపై భారత్‌ చేస్తున్న పోరాటానికి సహకరించేలా అవసరమైన సమాచారం అందచేసేందుకు స్విట్జర్లాండ్‌ నూతన ఒప్పందంపై అంగీకారం తెలిపింది.

మరిన్ని వార్తలు