మేలో సేవలు, తయారీ పేలవం..

4 Jun, 2016 01:34 IST|Sakshi
మేలో సేవలు, తయారీ పేలవం..

న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 70 శాతం వాటా కలిగిన సేవలు, తయారీ రంగాలు మే నెలలో పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు నికాయ్ సూచీలు పేర్కొంటున్నాయి. కొత్త ఆర్డర్లు లేకపోవడం దీనికి కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. జూన్ 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి సమీక్ష నేపథ్యంలో వెలువడిన ఈ సూచీ అంశాలు... రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు ప్రస్తుతం 6.5 శాతం) కోత అవసరాన్ని సూచిస్తున్నట్లు కూడా ఆ వర్గాల అభిప్రాయం. సూచీలను చూస్తే..

 నికాయ్/మార్కిట్ సేవల బిజినెస్ యాక్టివిటీ: సేవల రంగం క్రియాశీలతను సూచించే ఈ సూచీ ఏప్రిల్‌లో 53.7 పాయింట్ల వద్ద ఉండగా, మేలో 51 పాయింట్లకు పడింది. నవంబర్ తరువాత ఈ సూచీ ఈ స్థాయికి దిగడం ఇదే తొలిసారి.

 నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ: తయారీ, సేవల రంగాలు రెండింటినీ సూచించే ఈ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 52.8 పాయింట్ల వద్ద ఉండగా, మేలో 50.9 పాయింట్లకు పడింది. తాజా సూచీలు దేశ ఆర్థిక రికవరీ అంచనాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నట్లు సర్వేను రూపొందించిన మార్కిట్ ఆర్థికవేత్త పోలానా డీ లిమా అన్నారు.

మరిన్ని వార్తలు