దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం

9 Sep, 2019 14:24 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ ఆటో పరిశ్రమ మరింత కుదేలవుతోంది. వరుసగా పదవ నెలలో కూడా అమ్మకాలు భారీగా పడిపోయాయి. నెలవారీ ప్యాసింజర్‌ వాహనాలు,ఇతర కార్ల అమ్మకాలు ఆగస్టులో దారుణంగా పడిపోయాయి.  భారతీయ ఆటోమొటైల్‌ ఉత్పత్తుల అసోసియేన్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత మాసంలో  రికార్డు క్షీణతను నమోదు చేశాయి. 1997-98 సంవత్సం నుంచి  డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి  ఇదే  అతిపెద్ద క్షీణత అని  సియామ్‌ వెల్లడించింది. 

దీంతో భారత ఆటో రంగ సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు సంవత్సరానికి 31.57 శాతం పడిపోయి ఆగస్టులో 196,524 యూనిట్లకు చేరుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సమవారం విడుదల  చేసిన గణాంకాలు  ప్రకారం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 41.09 శాతం తగ్గి 115,957 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రక్, బస్సు అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22శాతం పడిపోయి 1.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. అయితే ఎగుమతులు 14.73 శాతం పుంజుకున్నాయి. 

కాగా ఆటో అమ్మకాల క్షీణత ఈ రంగంలో భారీగా ఉద్యోగ నష్టానికి దారితీస్తున్న సంగతి తెలిసిందే. వాహన కంపెనీలు ఇప్పటికే 15 వేలమంది  తాత్కాలిక ఉద్యోగులను తొలగించాయి. గత మూడు నెలల్లో దాదాపు 300 డీలర్షిప్‌లు మూతపడగా, దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఉద్యోగులను డీలర్లు తొలగించారు. మాంద్యం కొనసాగితే మరో పది లక్షల ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు నెలకొన్నాయి.  అటు  భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత వారం హర్యానాలోని తన గురుగ్రామ్, మనేసర్ ప్లాంట్లలో ఉత్పత్తిని రెండు రోజులు నిలిపివేసినట్లు తెలిపింది. గత వారం జరిగిన ఒక సమావేశంలో లక్షలాది మంది ఉద్యోగాల కోతలకు కారణమైన  మందగమనం ఇలాగే కొనసాగితే మరింత సంక్షోభం తప్పదని పరిశ్రమ వర్గాలు  ఆందోళనపడుతున్నాయి. మరోవైపు అశోక్‌ లేలాండ్‌ తాజా గణాంకాల నేపథ్యంలో మరో 16 రోజుల పనిదినాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు