బీపీసీఎల్‌కు ‘డౌన్‌గ్రేడ్‌’ ముప్పు!

4 Oct, 2019 09:56 IST|Sakshi

ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై మూడీస్‌ వ్యాఖ్యలు

ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)ను ప్రైవేటీకరించిన పక్షంలో రేటింగ్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ హెచ్చరించింది. ప్రస్తుతం సార్వభౌమ రేటింగ్‌ స్థాయిలో ఉన్న ట్రిపుల్‌ బి మైనస్‌ స్థాయిని బీఏ1 స్థాయికి తగ్గించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రైవేటీకరణతో బీపీసీఎల్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయి.. బాండ్ల ఉపసంహరణ కోసం ఒత్తిడి పెరుగుతుందని, ఇది కంపెనీ రుణపరపతిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్‌ తెలిపింది. కొనుగోలు చేసే సంస్థ ప్రభుత్వ రంగంలోనిదా లేక ప్రైవేట్‌ కంపెనీయా అన్న దానిపై బీపీసీఎల్‌ క్రెడిట్‌ రేటింగ్స్‌ ఆధారపడి ఉంటాయని మూడీస్‌ వెల్లడించింది.

బీపీసీఎల్‌లో ఉన్న మొత్తం 53.29 శాతం ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు సెప్టెంబర్‌ 30న జరిగిన సమావేశంలో కార్యదర్శుల బృందం ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని అంచనా. ప్రస్తుత షేరు ధరల ప్రకారం బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విలువ సుమారు రూ. 57,500 కోట్లకు పైగా ఉంటుంది. సెప్టెంబర్‌ 30 నాటి గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ బాండ్లకు సంబంధించి బీపీసీఎల్‌ 1.7 బిలియన్‌ డాలర్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. కంపెనీ ద్రవ్య పరిస్థితి ఇప్పటికే బాగా లేదు. ఇలాంటప్పుడు విదేశీ కరెన్సీ బాండ్లను తిరిగి చెల్లించాల్సి వస్తే బీపీసీఎల్‌కు రీఫైనాన్సింగ్‌పరమైన రిస్కులు గణనీయంగా ఉంటాయని అంచనా. 2019 మార్చి ఆఖరు నాటికి బీపీసీఎల్‌ దగ్గర రూ. 5,300 కోట్ల మేర నగదు, తత్సమాన నిల్వలు ఉండగా.. వచ్చే 15 నెలల్లో రూ. 10,900 కోట్ల మేర రుణాలను చెల్లించాల్సి రానుంది.

>
మరిన్ని వార్తలు