మూడీస్‌ ‘రేటింగ్‌’ షాక్‌

9 Nov, 2019 04:51 IST|Sakshi

భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ ‘నెగెటివ్‌’కు కోత

ఇప్పటి వరకు స్థిర అవుట్‌లుక్‌

సమీప కాలంలో వృద్ధి కోలుకోకపోవచ్చని అంచనా

భారత్‌ మూలాలు పటిష్టమన్న కేంద్రం

న్యూఢిల్లీ: భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ (దృక్పథాన్ని)ను ప్రతికూలానికి (నెగెటివ్‌) మారుస్తూ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇది స్థిరం (స్టేబుల్‌)గా ఉంది. ఆరి్థక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయినట్టు మూడిస్‌ పేర్కొంది. దీంతో సమస్యలు పెరిగాయని, ఫలితంగా వృద్ధి రేటు ఇక ముందూ తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది.

విదేశీ కరెన్సీ రేటింగ్‌ను మార్చకుండా ‘బీఏఏ2 మైనస్‌’గానే కొనసాగించింది.పెట్టుబడుల విషయంలో రెండో అతి తక్కువ గ్రేడ్‌ ఇది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2019–20) 3.7 శాతంగా ఉంటుందని మూడీస్‌ అంచనా వేసింది. ప్రభుత్వ లక్ష్యం జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతం కంటే ఇది ఎక్కువే. వృద్ధి తక్కువగా ఉండడం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాల నేపథ్యంలో ద్రవ్యలోటు అంచనాలను మూడీస్‌ పెంచింది. జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 2013 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలో 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మూడిస్‌ నిర్ణయం వెలువడడం గమనార్హం. అయితే, రేటింగ్‌ అవుట్‌లుక్‌ను తగ్గించడంతో మరిన్ని సంస్కరణలు, దిద్దుబాటు చర్యల దిశగా ప్రభుత్వంపై ఒత్తిళ్లను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిచ్‌ రేటింగ్స్, ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ మాత్రం ఇప్పటికీ భారత అవుట్‌లుక్‌ను స్థిరంగానే (స్టేబుల్‌)గానే కొనసాగిస్తున్నాయి.  

మూడీస్‌ అభిప్రాయాలు...
►అవుట్‌లుక్‌ను నెగెటివ్‌కు మార్చడం పెరిగిన రిస్‌కలను తెలియజేస్తుంది. ఆరి్థక రంగ వృద్ధి గతం కంటే తక్కువగానే ఉండనుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆరి్థక, వ్యవస్థాగత బలహీనతలను పరిష్కరించే విషయంలో ప్రభావవంతంగా వ్యవహరించలేకపోవడాన్ని ఇది కొంత మేర ప్రతిఫలిస్తుంది.  
►ఇప్పటికే రుణ భారం అధిక స్థాయిలో ఉండగా, ఇది ఇంకా క్రమంగా పెరిగేందుకు దారితీస్తుంది.
►ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు మందగమనం తీవ్రత, కాల వ్యవధిని తగ్గించొచ్చు.
►గ్రామీణ స్థాయిలో దీర్ఘకాలం పాటు ఆరి్థక ఒత్తిళ్లు, ఉపాధి కల్పన బలహీనంగా ఉండటం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌ఐ) రుణ సంక్షోభంతో మందగమనం మరింత స్థిరపడే అవకాశాలున్నాయి.
►ఎన్‌బీఎఫ్‌ఐల్లో  రుణ సంక్షోభం వేగంగా పరిష్కారం కాకపోవచ్చు.  
►ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఆరి్థక రంగానికి మద్దతునిస్తాయే గానీ, ఉత్పాదకత, వాస్తవ జీడీపీ వృద్ధి పూర్వపు స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు.
►నెగెటివ్‌ అవుట్‌లుక్‌ సమీప కాలంలో రేటింగ్‌ అప్‌గ్రేడ్‌కు ఛాన్స్‌ లే దని తెలియ జేస్తుంది.

ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయి: కేంద్రం రేటింగ్‌ అవుట్‌లుక్‌ను నెగెటివ్‌గా మార్చడం పట్ల కేంద్ర ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. దీనివల్ల భారత్‌పై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ‘‘ఆరి్థక రంగ మూలాలు పూర్తి బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీసుకున్న వరుస సంస్కరణలు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తాయి. భారత్‌ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది’’ అని కేంద్ర ఆరి్థక శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

2019 భాతర వృద్ధి రేటు 6.1 శాతం, తర్వాతి సంవత్సరంలో 7 శాతంగా ఉండొచ్చన్న ఇటీవలి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనాలను ప్రస్తావించింది. భారత వృద్ధి సామర్థ్యాలు ఏమీ మారలేదన్న ఐఎంఎఫ్, ఇతర సంస్థల అంచనాలను గుర్తు చేసింది. ‘‘అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో చురుకైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ చర్యలు భారత్‌ పట్ల సానుకూల దృక్పథానికి దారితీస్తాయి. నిధులను ఆకర్షించడంతోపాటు, పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తాయి’’అని పేర్కొంది.

మరిన్ని వార్తలు