ఆ బ్యాంక్‌ల గవర్నెన్స్‌ మెరుగుపడుతుంది..

19 Sep, 2018 00:27 IST|Sakshi

మూడు బ్యాంకుల విలీనంపై మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ అంచనా

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ), విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదన ఆయా బ్యాంకులకు సానుకూల అంశమని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తెలిపింది. దీనితో వాటి గవర్నెన్స్, సమర్ధత మెరుగుపడగలదని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ గ్రూప్‌) అల్కా అన్బరసు తెలిపారు. విలీన బ్యాంక్‌కు రుణాల పరంగా 6.8 శాతం మార్కెట్‌ వాటా ఉంటుందని, తద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలో మూడో అతి పెద్ద బ్యాంక్‌గా మారగలదని వివరించారు.

కొత్త సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధనపరమైన తోడ్పాటు తప్పనిసరిగా అవసరమవుతుందని అమె తెలిపారు. అసెట్‌ క్వాలిటీ, మూలధనం, లాభదాయకత తదితర విషయాల్లో  దేనా బ్యాంక్‌తో పోలిస్తే బీవోబీ, విజయా బ్యాంక్‌లు మెరుగ్గా ఉన్నాయని వివరించారు. రుణ వృద్ధికి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వ రంగంలోని ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ తర్వాత దాదాపు రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో .. ఈ విలీన సంస్థ దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్‌గా నిలవనుంది.

ఏప్రిల్‌ 1 నుంచి  ఏర్పాటు..
విలీనానంతరం ఏర్పాటయ్యే కొత్త సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దేశిత గడువులోగా విలీనంపై మూడు బ్యాంకులు కసరత్తు చేయాల్సి ఉంటుందని, 2018–19 ఆఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని వివరించాయి.

మొత్తం మీద 2019 ఏప్రిల్‌ 1 నుంచి విలీన సంస్థ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని పేర్కొన్నాయి. మూడు బ్యాంకుల బోర్డులు ఈ నెలలోనే సమావేశం కానున్నాయని, ఆ తర్వాత విలీన సీక్మ్‌ రూపకల్పన జరుగుతుందని సంబంధిత వర్గాలు వివరించాయి. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటర్‌ నుంచి అవసరమయ్యే మూలధనం తదితర వివరాలన్నీ ఇందులో ఉండనున్నాయి.

యూనియన్ల వ్యతిరేకత..:
కాగా, మూడు బ్యాంకుల విలీన ప్రతిపాదనను బ్యాంక్‌ ఉద్యోగుల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. బడా కార్పొరేట్ల మొండిబాకీలు, వాటి రికవరీ పైనుంచి దృష్టి మళ్లించేందుకే దీన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించాయి. విలీనాలతోనే బ్యాంకులు పటిష్టంగా, సమర్ధంగా మారతాయనడానికి నిదర్శనాలేమీ లేవని ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం వ్యాఖ్యానించారు.

ఎస్‌బీఐలో మిగతా అనుబంధ బ్యాంకులను విలీనం చేయడం వల్ల అద్భుతాలేమీ జరిగిపోలేదని పేర్కొన్నారు. పైపెచ్చు ప్రతికూలతలూ ఏర్పడ్డాయన్నారు. ఎస్‌బీఐ 200 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నష్టాలు ప్రకటించిందన్నారు. మరోవైపు బ్యాంకుల విలీనంతో ప్రయోజనం, వాటి ఉద్యోగుల భవిష్యత్‌ ఏమిటన్న దానిపై స్పష్టత లేదని నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అశ్విని రాణా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు