లాభాలకు ‘కోత’!

9 Nov, 2019 06:08 IST|Sakshi

భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను తగ్గించిన మూడీస్‌ 

పతనమైన రూపాయి 

ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైకి సెన్సెక్స్‌ 

పై స్థాయిల్లో లాభాల స్వీకరణ 

330 పాయింట్ల నష్టంతో 40,324కు సెన్సెక్స్‌ 

104 పాయింట్లు పతనమై 11,908కు నిఫ్టీ

భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌కు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ మూడీస్‌ కోత విధించింది. దీంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో  శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. రెండు రోజుల రికార్డ్‌ లాభాలకు బ్రేక్‌ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు తగ్గి మూడు వారాల కనిష్ట స్థాయి, 71.30కు చేరడం, ఈ ఏడాది వృద్ధి అంచనాలను నొముర సంస్థ 5.7 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,749 పాయింట్లను తాకినప్పటికీ, చివరకు 330 పాయింట్ల నష్టంతో 40,324 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 11,908 పాయింట్ల వద్దకు చేరింది.  ఈ వారంలో మొత్తం ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైలను తాకింది. మొత్తం మీద ఈ వారంలో సెన్సెక్స్‌ 159 పాయింట్లు, నిఫ్టీ 18 పాయిట్లు చొప్పున పెరిగాయి.  

485 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్ సంస్థ మన దేశ క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘స్థిరత్వం’ నుంచి ‘ప్రతికూలం’కు తగ్గించింది. మన దేశంలో నెలకొన్న ఆరి్థక బలహీనతలను అధిగమించడంలో ప్రభుత్వం విఫలమైందని, వృద్ధి మరింతగా తగ్గగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. సెన్సెక్స్‌ నష్టాల్లోనే ఆరంభమైననప్పటకీ, మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలోనే కదలాడింది. ఆ తర్వాత లాభాల్లోకి వచి్చనప్పటికీ, మళ్లీ నష్టాల్లోకి జారిపోయింది. చివరి రెండు గంటల్లో నష్టాలు బాగా పెరిగాయి.

ఒక దశలో 95 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 390 పాయింట్లు పడింది. రోజంతా 485 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  ఎమ్‌ఎస్‌సీఐ ఇండియా సూచీ, ఎమ్‌ఎస్‌సీఐ గ్లోబల్‌ స్టాండర్డ్‌ సూచీల్లో షేర్లలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ సూచీల్లోంచి తీసేసిన షేర్లు నష్టపోగా, చేర్చిన షేర్లు లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు