ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు

27 Mar, 2020 06:09 IST|Sakshi

ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌కుమార్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఉపశమన ప్యాకేజీని తీసుకొచ్చిందని ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌కుమార్‌ అన్నారు. పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1.7  లక్షల కోట్ల ప్యాకేజీని గురువారం ప్రకటించిన విషయం తెలిసినదే. కోవిడ్‌–19 మహమ్మారి ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియదు కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంటుందని రజనీష్‌కుమార్‌ అంచనా వేశారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ అసాధారణ పరిస్థితుల్లో ఉందని, భారత్‌ ఇందుకు మినహాయింపేమీ కాదన్నారు. ‘‘ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరైన మార్గం చూపుతుంది. ఇది చక్కగా రూపొందించిన ప్యాకేజీ. బలహీన వర్గాలు కనీస వసతుల విషయంలో ఇబ్బంది పడకూడదన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తోంది’’అని రజనీష్‌ అన్నారు.   
అవసరమైన చర్యలు..
బలహీన వర్గాల వారికి ప్రభుత్వ ప్యాకేజీ అవసరమైనంత సాయం అందిస్తుందని ఇండియన్‌ బ్యాంకు ఎండీ పద్మజ చుండూరు అభిప్రాయపడ్డారు. ‘‘ఆరోగ్య సంరక్షకులకు బీమా రక్షణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు సాయం, ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు ఎంతో అవసరమైనవి’’ అని పద్మజ తెలిపారు.

మరిన్ని వార్తలు