మరింత సౌకర్యంగా మనీ ట్రాన్స్‌ఫర్

27 Jul, 2014 01:55 IST|Sakshi
మరింత సౌకర్యంగా మనీ ట్రాన్స్‌ఫర్

మీ బంధువులెవరైనా ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళుతున్నారనుకోండి. ఆ తర్వాత మీకు రెమిటెన్స్ అనే పదం పరిచయమవుతుంది. విదేశాలకు వెళ్లడం, రెమిటెన్స్ అనే పదాలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంది. సులభంగా చెప్పాలంటే, మెరుగైన ఆర్థిక, జీవన ప్రమాణాల కోసం చాలా మంది విదేశాలకు వెళుతుంటారు. అక్కడ ధనం ఆర్జించి తమ కుటుంబాలకు ఆ దేశం నుంచి సొంతదేశానికి డబ్బులు పంపిస్తారు. దీనినే రెమిటెన్స్ అంటారు.

 భారత్‌లాంటి పెద్ద దేశాల్లో రెమిటెన్స్‌లకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉంది. భారత్‌లో చాలా కుటుంబాల్లో రెమిటెన్సెస్ చాలా కీలకమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చు. విదేశాల నుంచి స్వదేశంలోని తమ వారికి డబ్బులను పంపించే విషయంలో చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కడ నుంచి ఇక్కడకు డబ్బులు పంపించే విధానం సౌకర్యంగా ఉండాలి, డబ్బులు త్వరగా ఇక్కడి వాళ్లకు అందాలి, ఆ సొమ్ములు సురక్షితంగా చేరాలి. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుండటంతో విదేశాల నుంచి స్వదేశాలకు డబ్బులు పంపించే విధానంలో చాలా మార్పులు వచ్చాయి.

 రెమిటెన్సెస్‌కు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని పద్ధతులు...,
 బ్యాంకుల ద్వారా చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు మనీ ట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్నందిస్తున్నాయి. ఈ విధానంలో డబ్బులు పంపించే వ్యక్తి సదరు బ్యాంక్ శాఖకు వెళ్లి తమ సొమ్ములను డిపాజిట్ చేయాలి. ఈ డబ్బులను అందుకునే వ్యక్తి తమకు సమీపంలోని అదే బ్యాంక్ శాఖకు వెళ్లి తమ సొమ్ములను కలెక్ట్ చేసుకోవచ్చు.

 చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, అధిక వేతనాలు పొందేవాళ్లు, కార్మికులు, ఇతర శ్రామికులు ఈ విధానాన్నే ఎంచుకుంటారు. అత్యంత నమ్మకమైనది కావడమే దీనికి కారణం. మరోవైపు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ (ఎన్‌ఈఎఫ్‌టీ) ద్వారా కూడా డబ్బులను పంపించవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో అక్కడవాళ్లకు, ఇక్కడి వాళ్లకు ఆయా బ్యాంక్ శాఖల్లో ఖాతాలుండడం తప్పనిసరి.

 ఐఎంటీఓ ద్వారా
 ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్ ఆపరేటర్స్(ఐఎంటీఓ) ద్వారా డబ్బులు పంపించడం పెరిగిపోతోంది. సులభంగా, సౌకర్యంగా ఉండటమే దీనికి కారణం. సంప్రదాయమైన క్యాష్-టు-క్యాష్ మెథడ్‌లో అక్కడ డబ్బులు పంపించే వ్యక్తి సమీపంలోని ఐఎంటీఓ అదీకృత ఏజెంట్ దగ్గరకు వెళ్లాలి. తగిన గుర్తింపు ధుృవపత్రాలు చూపించి నగదు డిపాజిట్ చేయాలి. ఇక్కడ డబ్బులు పొందే వ్యక్తి తన సమీపంలోని ఐఎంటీఓ ఏజంట్ దగ్గరకు వెళ్లి, తగిన ధ్రువపత్రాలు సమర్పించి ఆ డబ్బులను తీసుకోవచ్చు.

 అక్కడ డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత నిమిషాల్లోనే ఇక్కడ డబ్బులు తీసుకోవచ్చు. దీంట్లో క్యాష్-టు-కార్డ్ విధానం కూడా ఉంది. ఈ విధానంలో అక్కడి వ్యక్తి ఇక్కడ వ్యక్తి కార్డ్‌కు నేరుగా సొమ్ములను పంపించవచ్చు. ఇక క్యాష్-టు-అకౌంట్ అనే  విధానంలో విదేశాల్లో డబ్బులు పంపించే వ్యక్తి ఏజెంట్ దగ్గరకు వెళ్లి డిపాజిట్ చేయాలి. ఆ నిధులు ఇక్కడి వ్యక్తి అకౌంట్‌లోకి వచ్చేస్తాయి. తన సౌలభ్యాన్ని బట్టి ఈ వ్యక్తి ఎప్పుడైనా ఈ డబ్బులను తీసుకోవచ్చు.

 ఆన్‌లైన్ విధానం..
 ఇప్పుడిప్పుడే ఈ విధానం ప్రాచుర్యం పొందుతోంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ఏ కంప్యూటర్‌తోనైనా డబ్బులు పంపించవచ్చు. చాలా మంది విదేశాల్లోని భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు స్వదేశంలోని తమ తల్లిదండ్రులకు, బంధువులకు ఈ విధానంలోనే డబ్బులు పంపిస్తారు. దీనికి బ్యాంక్ అకౌంట్ ఉండడం తప్పనిసరి.

 కొత్త టెక్నాలజీ మనీ ట్రాన్స్‌ఫర్స్
 స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోతోంది. దీంతో మొబైల్ ట్రాన్స్‌ఫర్‌లు కూడా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఇవి ఇంకా మరింతగా పెరుగుతాయి. 

మరిన్ని వార్తలు