మరిన్ని సంస్కరణలు తెస్తాం..

19 Sep, 2015 01:25 IST|Sakshi
మరిన్ని సంస్కరణలు తెస్తాం..

భారీ పెట్టుబడులు పెట్టాలని విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి ఆహ్వానం
సింగపూర్‌లో ఇన్వెస్టర్లతో సమావేశం

 
 సింగపూర్ : రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. భారీగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనున్నదని చెప్పారు.  భారత వృద్ధి కథలో పాలుపంచుకోవలసిందిగా ఆయన విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తామని, సంస్కరణలు కొనసాగిస్తామని ఆయన అభయం ఇచ్చారు. వ్యాపారం చేయడానికి, పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. దివాళా చట్టం సిద్ధంగా ఉందని, ఆర్బిట్రేషన్ చట్టాల్లో మార్పులు చేస్తున్నామని, మరిన్ని సంస్కరణలు రానున్నాయని చెప్పారు.

విదేశీ ఇన్వెస్టర్లు, ప్రభుత్వ నాయకులతో సమావేశమవ్వడానికి ఆయన శుక్రవారం ఉదయం సింగపూర్‌కు వచ్చారు. దాదాపు 300కు పైగా సింగపూర్‌కు చెందిన వ్యాపార ప్రముఖులు, ఇన్వెస్టర్లతో ఆయన సమావేశమయ్యారు. విస్తృతంగా జరిగిన ఈ సమావేశంలో అమెరికా, యూరప్‌లకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. పెట్టుబడులు, సంస్కరణలు, వృద్ధి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

 భారత్‌పై భారీగా ఆశలు..
 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు భారత్‌లో ఇటీవల సంస్కరణల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన దేశంగా భారత్‌పై భారీగా ఆశలున్నాయని అరుణ్ జైట్లీ వివరించారు. బ్రిక్స్ దేశాల నుంచి భారత్‌ను తొలగించాలని కొందరు నిపుణులు పేర్కొన్నారని, ప్రస్తుతం బ్రిక్స్ దేశాల్లో వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. విధానాల నిష్క్రియాపరత్వం, పన్నుల్లో అనిశ్చితి తదితర నిరాశామయ పరిస్థితులు ఇక భారత్‌లో ఉండబోవని ఆయన భరోసా ఇచ్చారు. భారత్‌లోని రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించడానికి ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయని వివరించారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుండటం భారత్‌కు భారీగా ప్రయోజనకరమని తెలిపారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గాయని పేర్కొన్నారు.  సమస్యలు ఎదుర్కొంటున్న ఉక్కు, విద్యుత్తు, తదితర రంగాలపై దృష్టిసారిస్తున్నామని, ఈ రంగాల సమస్యల పరిష్కారాల కోసం కృషి చేస్తున్నామని వివరించారు. బ్యాంకులకు మరింతగా మూలధన నిధులు అందిస్తున్నామని, వాటి పనితీరు మెరుగుపడే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 అంతటా మందగమనం. ఇక్కడ జోరుగా వృద్ధి..
 జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందలేకపోయిందని జైట్లీఅంగీకరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ కారణంగా సబ్సిడీల భారం తగ్గిందని, ప్రభుత్వ వ్యయంలో హేతుబద్ధీకరణ చోటు చేసుకుందని తెలిపారు. ఈ స్కీమ్‌ను ఆహార, ఎరువులకూ వర్తింపజేస్తామన్నారు.  గత కొన్నేళ్లుగా మందగించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.
 
 అందరి కోరికా... రేట్ల తగ్గింపే!: జైట్లీ
 సింగపూర్: వృద్ధి ఊపందుకోడానికి తక్కువ వడ్డీరేటు వ్యవస్థ అవసరమని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పాలసీ నిర్ణేతలుసహా ప్రతి ఒక్కరూ రేట్ల తగ్గింపునే కోరుకుంటున్నారని అన్నారు. అయితే తాను ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణ యం తీసుకోవడంపై ఎటువంటి ప్రభావం చూపబోనని స్పష్టం చేశారు. ఇక్కడ ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ తన బాధ్యతలను అత్యుత్తమ స్థాయిలో నిర్వహిస్తుందని అన్నారు. దేశీయ, అంతర్జాతీయ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రేట్ల కోతపై ఒక నిర్ణయం తీసుకుం టుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 పాలసీ చర్యకు తగిన సమయం: సిన్హా
 ఇదిలావుండగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు కోతకు ఇది తగిన సమయమని అన్నారు. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిల్లో ఉండడం, అమెరికా ఫెడ్ నిర్ణయం వంటి అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు