వృద్ధికి మరిన్ని సంస్కరణలే కీలకం..

29 Oct, 2019 05:53 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ మల్‌పాస్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కూడా కారణమని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మల్‌పాస్‌ పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలు, నవకల్పనలు భారత వృద్ధికి కీలకంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ ఎదగాలంటే.. ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అవసరమని డేవిడ్‌ తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్‌ ఎంతో పురోగతి సాధించినా.. బ్యాంకింగ్‌ రంగం, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగం (ఎన్‌బీఎఫ్‌సీ), క్యాపిటల్‌ మార్కెట్ల వంటి వాటి విషయంలో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.

‘మూడు ప్రధాన రంగాల్లో పురోగతి సాధించాలి. ముందుగా ప్రైవేట్‌ రంగం సహా బ్యాంకింగ్‌ పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు అందించాలి. కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్, తనఖా రుణాల మార్కెట్‌ మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థతో పాటే ఎదిగిన ఎన్‌బీఎఫ్‌సీల్లో రిస్కులు ఉన్న నేపథ్యంలో వాటిని నియంత్రించాలి. సరైన నియంత్రణ చర్యలు తీసుకుంటే.. ఆర్థిక రంగం మరింత మెరు గుపడుతుంది’ అని డేవిడ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో 97 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందిస్తోందని డేవిడ్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం 24 బిలియన్‌ డాలర్లు అందించేందుకు ప్రపంచ బ్యాంకు కట్టుబడి ఉందన్నారు.

మరిన్ని వార్తలు