లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే...

23 Jan, 2017 02:28 IST|Sakshi
లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే...

అర్థక్రాంతి సంస్థాన్‌ వ్యవస్థాపకులు అనిల్‌ బొకిల్‌ సూచన
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నల్లధనం కట్టడికి దేశంలో ప్రతి లావాదేవీ బ్యాంకు ద్వారానే జరగాలని అర్థక్రాంతి సంస్థాన్‌ వ్యవస్థాపకులు అనిల్‌ బొకిల్‌ అన్నారు. జూనియర్‌ చాంబర్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) ఆహ్వానం మేరకు హైదరాబాద్‌ విచ్చేసిన ఆయన ఆదివారమిక్కడ జరిగిన కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు. బ్యాంకు ద్వారా మాత్రమే లావాదేవీలు పూర్తి అయితే ట్రాక్‌ చేయడానికి వీలవుతుందని చెప్పారు. బ్యాంకింగు వ్యవస్థలోకి డిపాజిట్లు రావడంతో ద్రవ్య సరఫరా పెరిగి ఎకానమీ గాడిన పడుతుందని తెలిపారు. ‘లెక్కచూపని నగదు లావాదేవీలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది.

పారదర్శకంగా ఉండే బ్యాంకు లావాదేవీలే ఇందుకు పరి ష్కారం. దేశంలో కస్టమ్స్‌ సుంకాలు మినహా మిగిలిన అన్ని పన్నులను రద్దు చేయాలి. బ్యాంకు వద్ద మా త్రమే పన్ను వసూలవ్వాలి. సొమ్ము స్వీకర్త మాత్రమే పన్ను చెల్లించాలి. రూ.100, ఆపైన ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేయాల్సిందే. చిన్న నోట్లు అంటే రూ.50 వరకు మాత్రమే సరఫరాలో ఉండాలి. పన్నులు లేని, తక్కువ నగదు లావాదేవీలు జరిగే ఎకానమీ ఉండాలని ప్రధానికి అర్థక్రాంతి సంస్థాన్‌ ప్రతిపాదించింది. మా ప్రతిపాదనలు అమలైతే జీఎస్‌టీ అవసరమే లేదు’ అని వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు