టర్మ్‌ ప్లాన్‌తో మరింత ధీమా!!

19 Feb, 2018 00:20 IST|Sakshi

తక్కువ ప్రీమియం .. అధిక కవరేజీ

సొంతిల్లు లేదా వాహనం కొనుక్కోవడం, పిల్లల చదువులు.. పెళ్లిళ్లు మొదలైన లక్ష్యాలకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు మనం ఎంతగానో ఆలోచిస్తాం. భవిష్యత్‌ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు.. పెట్టుబడుల కోసం మనం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్స్, పోస్టల్‌ స్కీమ్స్‌ లాంటి అనేక సాధనాలు ఎంచుకుంటూ ఉంటాం. వీటితో పాటు జీవిత బీమా కూడా కీలకమైనదే. ఇంటిల్లిపాదీ ఆధారపడిన ఇంటిపెద్దకు అనుకోనిదేదైనా జరిగినా.. కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడకుండా బీమా భరోసానిస్తుంది. జీవిత బీమాకు సంబంధించి అత్యంత తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజీని అందించేవి టర్మ్‌ ప్లాన్లు. వీటి గురించి అవగాహన కల్పించేదే ఈ కథనం..

ఓ రూ. 10 లక్షలు పెట్టి ఒక కొత్త కారు కొన్నామనుకోండి. దానికేమీ కాకుండా ముందుగా తగినంత కవరేజీ ఉండేలా వాహన బీమా తీసుకోవాలని ఆలోచిస్తాం. ఇందుకోసం ఏటా రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా ప్రీమియం కడతాం. వాహనం గురించే ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు ఎంతో విలువైన మన జీవితం గురించి, మనమీద ఆధారపడిన కుటుంబ సభ్యుల గురించి ఇంకెంత ఆలోచించాల్సి ఉంటుంది.

కారు భద్రత కోసం భారీ ప్రీమియం కట్టేందుకు సిద్ధపడే మనం .. అంతకన్నా ఎక్కువ విలువైన జీవితానికి బీమా తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇందుకోసం తోడ్పడే టర్మ్‌ పాలసీలు చాలా చౌకైనవి.. అత్యంత విలువైన మన జీవితాలకు, మనం ఎంతగానో ప్రేమించే కుటుంబానికీ భరోసానిచ్చే వి. వీటితో ఏటా అత్యంత తక్కువగా రూ. 8,000 నుంచి రూ. 10,000 దాకా ప్రీమియంతో ఏకంగా రూ. 1 కోటి దాకా కవరేజీని పొందవచ్చు (సిగరెట్‌ అలవాటు లేని ముప్పయ్‌ ఏళ్ల వ్యక్తికి).  

కవరేజీ లెక్క ఇలా..
సరే.. టర్మ్‌ పాలసీ తీసుకోవాలనుకుంటే ఎంత కవరేజీ ఉండేలా చూసుకోవాలన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రధానంగా మూడు అంశాలు ఈ విషయానికి సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
♦ బేస్‌ లైఫ్‌ కవర్‌:  సుమారు 40 ఏళ్ల దాకా వయస్సు ఉన్న వేతన జీవులు తమ వార్షికాదాయానికి కనీసం 20–30 రెట్లు సమానమైన కవరేజీ ఉండేలా చూసుకోవడం మంచిది. ఇక నలభైలలో ఉన్నవారు వార్షికాదాయానికి 10–20 రెట్లు, యాభైలలో ఉన్న వారు 5–10 రెట్లు కవరేజీ ఉండేలా చూసుకోవాలి. టర్మ్‌ లైఫ్‌ కవరేజీ.. పదవీ విరమణ చేసే దాకా కొనసాగేలా ఉండాలి.  
♦ రుణాలు: ఇతరత్రా చెల్లించాల్సిన రుణాలు మొదలైనవేమైనా ఉంటే టర్మ్‌ ప్లాన్‌ తీసుకునేటప్పుడు... బేస్‌ లైఫ్‌ కవరేజీకి ఆ మొత్తాన్ని కూడా జోడించి లెక్కేయాలి. ఒకవేళ పాలసీదారుకు అర్ధంతరంగా ఏదైనా జరిగినా.. రుణభారంతో వారి కుటుంబం ఇబ్బందుల పాలు కాకుండా ఇది ఆదుకుంటుంది.
♦  క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్రయోజనం: మన జీవన విధానాలు ఒక్కోసారి తీవ్ర అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదముంది. కనుక క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్రయోజనాలు కూడా అందించే టర్మ్‌ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ పాలసీదారు.. ప్లాన్‌లో పేర్కొన్న తీవ్రమైన అనారోగ్యాల బారిన పడిన పక్షంలో బీమా మొత్తాన్ని ఒకేసారి అందుకునే వీలు ఉంటుంది.

పాలసీ తీసుకునేటప్పుడు వాస్తవాలు దాచిపెట్టొద్దు ..
జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థకు తప్పనిసరిగా కొన్ని వివరాలు తెలియజేయాలి. ముఖ్యంగా జీవన విధానాలు, వ్యక్తిగత.. కుటుంబ ఆరోగ్యం తదితర అంశాల్లో ఏదీ దాచిపెట్టే ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఇక పాలసీదారు ఆరోగ్యాన్ని మదింపు చేయడానికి బీమా సంస్థ వైద్య పరీక్షల నివేదికలను కోరే అవకాశంఉంది. కస్టమర్‌కి ఎంత మేర కవరేజీ ఇవ్వొచ్చన్నది అంచనా వేసుకునేందుకు బీమా సంస్థకు ఇవి ఉపయోగపడతాయి. ఏ విషయంలోనూ తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా.. వాస్తవాలను తొక్కిపెట్టి ఉంచడం లాంటిది చేస్తే క్లెయిమ్‌ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

- ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ,లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 

మరిన్ని వార్తలు