అత్యధిక ఉద్యోగాలు ఐటీ రంగంలోనే! 

3 May, 2019 00:54 IST|Sakshi

2019 ఏడాదిపై షైన్‌డాట్‌కామ్‌ నివేదిక

ముంబై: వివిధ రంగాల సంస్థలు టెక్నాలజీకిచ్చే ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఐటీ/సాఫ్ట్‌వేర్‌ రంగంలో అత్యధికంగా ఉద్యోగాల కల్పన కొనసాగనుంది. ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ షైన్‌డాట్‌కామ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశం వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నియామకాలను.. అంతక్రితం నెలతో పోలుస్తూ తయారు చేసిన నివేదిక ప్రకారం.. ఉద్యోగాల కల్పనలో బీపీవో/కాల్‌ సెంటర్‌ పరిశ్రమ వెనుకబడింది. దీంతో రెండో స్థానంలోకి తయారీ రంగం చేరింది. గణనీయంగా ఉద్యోగాల కల్పనతో బీఎఫ్‌ఎస్‌ఐ, విద్యా.. శిక్షణ రంగాలు టాప్‌ 10 లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఉత్పత్తి, నిర్వహణ, సేవల రంగాలు కూడా ఉపాధిలో గణనీయంగా వృద్ధి సాధించినట్లు షైన్‌డాట్‌కామ్‌ సీఈవో జైరస్‌ మాస్టర్‌ చెప్పారు.

అత్యధికంగా ఉద్యోగాలిచ్చే పరిశ్రమల్లో ఆతిథ్య రంగం కూడా చోటు దక్కించుకుందని ఆయన పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, పబ్లిక్‌ రిలేషన్స్, ఈవెంట్స్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రంట్‌ ఆఫీస్, సెక్రటరీ, హెచ్‌ఆర్‌ విభాగాల్లో ఉద్యోగాల కల్పన మందగించింది. అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిన నగరాల జాబితాలో బెంగళూరు, ముంబై,  ఢిల్లీ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు