అత్యంత లాభదాయక పీఎస్‌యూ ఐవోసీ

1 Jun, 2018 01:25 IST|Sakshi

వరుసగా రెండో ఏడాది

దేశంలోనే నంబర్‌వన్‌  స్థానంలో రిలయన్స్‌ 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోకెల్లా (పీఎస్‌యూ) అత్యంత లాభసాటి కంపెనీగా చమురు మార్కెటింగ్‌ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) అగ్రస్థానంలో నిల్చింది. దీంతో ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి దిగ్గజం ఓఎన్‌జీసీని అధిగమించి వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిల్చినట్లయింది. టర్నోవరుపరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఉంటున్న ఐవోసీ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 21,346 కోట్ల నికర లాభం ప్రకటించింది.  ఓఎన్‌జీసీ రికార్డు లాభాలతో చాన్నాళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఒక దశలో ప్రభుత్వ రంగానికి చెందిన మొత్తం మూడు చమురు మార్కెటింగ్‌ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌) నికర లాభాలన్నింటినీ మించిన స్థాయిలో ఓఎన్‌జీసీ లాభాలు ఉండేవి. కానీ మూడేళ్ల క్రితం అత్యంత లాభసాటి కంపెనీ హోదాను రిలయన్స్, టీసీఎస్‌లకు సమర్పించుకుంది. 

వరుసగా మూడోసారి రిలయన్స్‌..     
ఇక దేశీయంగా అన్ని కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వరుసగా మూడో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ సంస్థ ఏకంగా రూ. 36,075 కోట్ల నికర లాభం ప్రకటించింది. అటు సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌.. రూ. 25,880 కోట్ల నికర లాభంతో దేశంలో అత్యంత లాభదాయక కంపెనీల జాబితాలో రెండో స్థానంలో నిల్చింది.    

మరిన్ని వార్తలు