అన్ని కాలాల్లోనూ మెప్పించిన ఫండ్‌!

30 Apr, 2018 00:06 IST|Sakshi

 మోతీలాల్‌ ఓస్వాల్‌ మోస్ట్‌ ఫోకస్డ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ 35

ప్రారంభించి కొన్నేళ్లే అయినా, పనితీరులో ఇప్పటి వరకు వెనుతిరిగి చూడలేదు. అదే మోతీలాల్‌ ఓస్వాల్‌ మోస్ట్‌ ఫోకస్డ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌. ఇది స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా అన్నింటిలోనూ ఇన్వెస్ట్‌ చేసే మల్టీక్యాప్‌ ఫండ్‌. మార్కెట్ల ఆటుపోట్ల సమయాల్లోనూ స్థిరమైన రాబడులను అందించిన చరిత్ర ఉంది. 

రాబడులు ఎలా ఉన్నాయంటే...
వార్షిక రాబడులను చూస్తే గడిచిన ఏడాది కాలంలో 18 శాతం, మూడేళ్ల కాలంలో 15 శాతం చొప్పున, ప్రారంభించిన నాటి నుంచి వార్షికంగా 28 శాతం చొప్పున ఈ పథకం రాబడులనిచ్చింది. ప్రామాణిక సూచీ అయిన నిఫ్టీ 500 కంటే అధిక రాబడులు ఇందులో ఉన్నాయి. మల్టీ క్యాప్‌ విభాగంలో ఇది ఉన్నత విభాగంలోకి వస్తుంది. ఇక త్రైమాసికం వారీ పనితీరు అంత ప్రామాణికంగా చూడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, గత డిసెంబర్‌ నుంచి చూసుకుంటే ఈ పథకం రాబడులు బెంచ్‌మార్క్‌ కంటే తక్కువే ఉన్నాయి. అయితే, గత కరెక్షన్‌ సమయంలోనూ (2015 జనవరి నుంచి 2016 ఫిబ్రవరి వరకు) ఈ పథకంలో నష్టాలే కనిపించాయి. అయినప్పటికీ మార్కెట్లు తిరిగి కోలుకోవడం మొదలైన తర్వాత చాలా వేగంగా ఈ పథకం పెట్టుబడుల విలువ పెరిగింది. దీంతో బెంచ్‌ మార్క్‌తోనూ, ఇదే విభాగంలోని ఇతర పథకాలతోనూ రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది.  

పెట్టుబడులు
మల్టీక్యాప్‌ ఫండ్‌ కావడంతో మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఏ స్థాయి కంపెనీల్లో అయినా పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ ఈ పథకానికి ఉంది. దీంతో పెట్టుబడుల పరంగా అధిక రాబడి అవకాశాలను సొంతం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ విలువలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిన నేపథ్యంలో ఈ విభాగంలో పెట్టుబడులను 10 శాతంలోపునకు తగ్గించుకుంది. అయితే, ఇటీవలి కరెక్షన్‌ నేపథ్యంలో మిడ్‌ క్యాప్‌లో పెట్టుబడులు 12 శాతానికి చేరాయి. పెట్టుబడులను గరిష్టంగా 35 స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. నిధుల్లో 10 శాతాన్ని విదేశీ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంది. అయితే, కొంత కాలంగా ఈ ఫండ్‌ మేనేజర్లు 20–25 స్థానిక స్టాక్స్‌ మించకుండా పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తున్నారు. స్టాక్స్‌ సంఖ్య తక్కువకు పరిమితం చేసినందున రిస్క్‌ తగ్గించేందుకు బాటమ్‌ అప్‌ స్టాక్స్‌ ఎంపిక విధానాన్ని అనుసరిస్తున్నారు. వృద్ధికి అవకాశాలుండి, సరసమైన ధరల్లో ఉన్న స్టాక్స్‌నే ఎంచుకుంటున్నారు. ఈ పథకంలో ఎక్స్‌పెన్స్‌ రేషియో సగటున చూస్తే తక్కువగానే ఉంది.

స్టాక్స్‌ ఎంపిక
కొన్ని ఐపీవోల్లోనూ ఈ పథకం ఇన్వెస్ట్‌ చేసింది. మన్‌పసంద్‌ బెవరేజెస్, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్, ఆల్కెమ్‌ ల్యాబ్స్‌ మంచి లాభాలను ఇచ్చాయి. గతేడాది టైటాన్, టీసీఎస్, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలోకి యాడ్‌ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులో వాటాలు తగ్గించుకోగా, ఎస్‌బీఐ, లుపిన్, అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌ నుంచి పూర్తిగా తప్పుకుంది.  

మరిన్ని వార్తలు