మోటరోలా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌.. వచ్చే నెలలోనే

17 Jan, 2019 13:19 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఫో‍ల్డబుల్‌ డివైస్‌లపై భారీ ఆసక్తి నెలకింది. మరోవైపు మొబైల్‌ దిగ్గజాలు శాంసంగ్‌,ఎల్‌జీ, హువావే లాంటివి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ల లాంచింగ్‌లపై యూజర్లను ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న మోటరోలా  తన ఐకానిక్‌ మోడల్‌  మొబైల్‌ను మళ్లీ తీసుకురాబోతోందన్న అంచనాలు మార్కెట్లో భారీగా వ్యాపించాయి. అత్యుత్తమ ఫీచర్స్‌తో తన పాపులర్‌ మోడల్‌ 'మోటరోలా రాజర్'ను తీసుకురాబోతోంది. అదీ ఫోల్డబుల్‌ డిస్‌ప్లేతో. ప్రీమియం ధరలో వచ్చే నెలలోనే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయనుంది. అద్భుత ఫీచర్లతో పూర్తిగా పునరుద్ధరించబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు లక్ష రూపాయలుగా ఉండనుందని అమెరికా టెలికాం దిగ్గజం వెరిజాన్‌ నివేదించింది. అయితే ఈ వార్తలను మోటరోలా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 

ఇప్పటికే అల్ట్రా థిన్‌ స్టయిలిష్‌ డిజైన్‌తో మోటరోలా రాజర్‌ వి3 ను 2004లో మొదటిసారిగా తీసుకొచ్చి, యంగ్‌ మొబైల్‌ యూజర్లలో ట్రెండ్‌సెట్‌ చేసింది. దాదాపు నాలుగేళ్లలో 130 మిలియన్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. మధ్యలో కొంత ప్రాభవాన్నికోల్పోయిన మోటరోలా 2011, 2012 సంవత్సరాల్లో మళ్లీ ప్రపంచంలోనే పలుచనైన మొబైల్‌గా డ్రాయిడ్‌ రాజర్‌ పేరుతో విడుదల చేసింది. ఇపుడిక ఫోల్డబుల్‌  స్మార్ట్‌ఫోన్‌తో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

కాగా  మరోవైపు ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ 'ఫ్లెక్స్‌పై'ను తీసుకొచ్చిన ఘనతను స్టార్ట‌ప్ కంపెనీ రాయొలే  కార్పొరేషన్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు