అలా చేస్తే అమెరికాకే దెబ్బ: నాస్కామ్‌

4 Jan, 2018 11:49 IST|Sakshi

బెంగళూరు : గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు వారి వీసాలను పొడిగించకుండా డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యాలయం తీసుకొస్తున్న నిబంధనలు అమెరికాను భారీగా దెబ్బతీయనున్నట్టు  ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్‌ పేర్కొంది. ఒకవేళ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే, కేవలం దేశీయ ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపడం మాత్రమే కాకుండా... అమెరికా పోటీతత్వంపై భారీగా ప్రభావం చూపనుందని తెలిపింది. నిబంధనల్లో అకస్మిక మార్పుల తీసుకొస్తే అమెరికాలో ప్రతిభావంతులైన నిపుణులు తగ్గిపోనున్నారని పేర్కొంది. స్థానిక నియామకం కూడా కష్టతరమవుతుందని వివరించింది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేథమేటిక్స్‌(ఎస్‌టీఈఎం) స్కిల్స్‌ ఉన్న వారు అమెరికాలో తక్కువగా ఉన్నారని, ఈ కారణంతోనే బహుళ జాతీయ కంపెనీలు వేలమంది ప్రతిభావంతులైన ఉద్యోగులను హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు తీసుకెళ్తున్నాయని నాస్కామ్‌ తెలిపింది.

''అమెరికాలో చాలా ఎక్కువగా నిపుణుల కొరత ఉంది. ఎస్‌టీఈఎం ఉద్యోగాల్లో ఖాళీ ఉన్న రెండు మిలియన్లలో, ఒక మిలియన్‌ ఉద్యోగాలు ఐటీకి చెందినవే. ప్రస్తుతం ట్రంప్‌ కార్యాలయం తీసుకుంటున్న చర్యలన్నీ, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనున్నాయి. స్కిల్‌ గ్యాప్‌నూ పూరించలేదు. ఈ అంశాలన్నింటిన్నీ పరిగణలోకి తీసుకుని ట్రంప్‌ కార్యాలయం నిర్ణయం తీసుకోవాలి'' అని నాస్కామ్‌ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌ చెప్పారు.

మరోవైపు ట్రంప్‌ కార్యాలయం తీసుకొస్తున్న ఈ నిబంధనలపై కోర్టుకు ఎక్కాలని టెక్‌ దిగ్గజాలు చూస్తున్నాయి. కేవలం దేశీయ ఐటీ కంపెనీలు మాత్రమేకాక, అమెరికా టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఐబీఎంలు కూడా తీవ్రంగా ప్రభావితం కానున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీల్లో పనిచేసే చాలా మంది హెచ్‌-1బీ వీసా ఉద్యోగులు, దశాబ్దం కింద నుంచి గ్రీన్‌ కార్డుల కోసం వేచిచూస్తున్నారని నిపుణులు చెప్పారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులను కాపాడుకోవడానికి అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంపెనీలు దావా దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు