జనవరి నుంచి పండగే...తగ్గనున్న టికెట్ల రేట్లు

22 Dec, 2018 17:08 IST|Sakshi

తగ్గనున్నమూవీ టికెట్ల రేట్లు

ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ హర్షం

సాక్షి, న్యూఢిల్లీ: సినిమా టికెట్లపై జీఎస్‌టీ తగ్గిస్తూ శనివారం, ఢిల్లీలో జరిగిన 31వ జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో సినిమా పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. కౌన్సిల్‌ నిర్ణయాలపై ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.  దాదాపు 33 వస్తువులపై ఇప్పటివరకు   వున్న 18శాతం  జీఎస్‌టీని 12, 5 శాతానికి  తగ్గించామనీ, అలాగే 28శాతం జీఎస్‌టీ స్లాబునుంచి 6 వస్తువులను 18శాతానికి తగ్గించినట్టు ఆర్థికమంత్రి తెలిపారు. తాజా నిర్ణయంతో  ప్రభుత్వ ఆదాయంపై దాదాపు  55వేల కోట్ల రూపాయల భారం పడునుందని జైట్లీ వెల్లడించారు.

ప్రభుత్వం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఒక ప్రకటన జారీ చేసింది. జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని  ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ వెల్లడించారు. భారతీయ సినీ పరిశ్రమ తరపున ప్రభుత్వానికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.  ఈ నిర్ణయం ఇండస్ట్రీలో మరిన్ని పెట్టుబడులకు, పరిశ్రమ అభివృద్ధికి అవకాశం లభిస్తుందన్నారు.

100రూపాయల లోపు ఉన్న సినిమా  టికెట్లపై  వసూలు చేసే జీఎస్‌టీ 18 శాతంనుంచి 12 శాతానికి,   రూ.100 రూపాయలకు మించిన  టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి  తగ్గించినట్టు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఈ సవరించిన జీఎస్‌టీ  రేట్లు జనవరి 1, 2019నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు