అక్షరాలా... రూ. 1.2 లక్షల కోట్లు

25 Dec, 2019 06:25 IST|Sakshi

2019లో పెరిగిన ముకేశ్‌ అంబానీ సంపద విలువ

ప్రస్తుతం సుమారు రూ. 4.3 లక్షల కోట్లు

అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానం

న్యూఢిల్లీ: అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్‌ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగింది. 60.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మంగళవారం నాటికి గణాంకాల ప్రకారం సుమారు 61 బిలియన్‌ డాలర్ల నికర విలువతో (దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్‌ అంబానీ 12వ స్థానంలో నిల్చారు.

ఏడాది కాలంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దూసుకెళ్లడం .. ముకేశ్‌ అంబానీ సంపద వృద్ధికి కారణమైంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ (ఎన్‌ఎస్‌ఈ) గణాంకాల ప్రకారం.. గడిచిన సంవత్సర కాలంలో రిలయన్స్‌ షేరు ఏకంగా 41 శాతం ఎగిసింది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో రూ. 1,544.50 వద్ద క్లోజయ్యింది. గత కొన్నాళ్లుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వివిధ వ్యాపార విభాగాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. జియో పేరిట టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌.. తాజాగా జియో గిగాఫైబర్‌ సేవలతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లోనూ దూసుకెడుతోంది. ఇక రిటైల్‌ రంగంలోనూ పట్టు సాధించడంతో పాటు త్వరలో ఈ–కామర్స్‌ విభాగంలోకి కూడా ప్రవేశించేందుకు జోరుగా కసరత్తు చేస్తోంది. ఈ–కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి దిగ్గజాలకూ గట్టి పోటీనివ్వనుంది.  

టాప్‌లో బిల్‌ గేట్స్‌..
బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సంపద ఈ ఏడాది మరో 22.4 బిలియన్‌ డాలర్లు పెరిగి 113 బిలియన్‌ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో ఉన్న అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ సంపద మాత్రం 13.2 బిలియన్‌ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ–కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా నికర విలువ 11.3 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల లిస్టులో ఆయన 19వ స్థానంలో ఉన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా