గొప్ప ప్రపంచ నాయకుల్లో ముకేశ్‌ అంబానీ

20 Apr, 2018 00:19 IST|Sakshi

ఫార్చూన్‌ మ్యాగజైన్‌ 

జాబితాలో 24వ స్థానం 

‘జియో’ డేటా సేవల ప్రభావం   

న్యూఢిల్లీ: చౌక డేటా సర్వీసులతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.. తాజాగా గొప్ప ప్రపంచ నాయకుల్లో ఒకరిగా ఫార్చూన్‌ మ్యాగజైన్‌ 2018 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన 24వ స్థానంలో నిల్చారు. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ లాయర్స్‌ కలెక్టివ్‌ వ్యవస్థాపకురాలు ఇందిరా జైసింగ్‌(20 ర్యాంక్‌), ఆర్కిటెక్ట్‌ బాలకృష్ణ దోషి(43) కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. రెండేళ్ల వ్యవధిలో మొబైల్‌ డేటాను సామాన్య ప్రజానీకానికి చేరువలోకి తెచ్చి, టెలికం మార్కెట్లో సంచలనం సృష్టించారు అని ముకేశ్‌ అంబానీ గురించి ఫార్చూన్‌ అభివర్ణించింది. సెప్టెంబర్‌ 2016లో కార్యకలాపాలు ప్రారంభించిన రిలయన్స్‌ జియో ఏకంగా 16.8 కోట్ల మంది యూజర్లను సంపాదించిందని పేర్కొంది.

చౌకగా డేటా, ఉచిత కాల్స్‌ అందించడమే దీని వెనుక రహస్యమన్న ఫార్చూన్‌.. ఈ పరిణామాన్ని ’జియోకరణ’గా అభివర్ణించింది.  అమెరికాలో కాల్పుల బాధిత మార్జొరీ స్టోన్‌మాన్‌ డగ్లస్‌ తదితర పాఠశాలల విద్యార్థులకు.. ఫార్చూన్‌ టాప్‌ ర్యాంక్‌ ఇచ్చింది. బిల్‌ మెలిండా గేట్స్‌ రెండో స్థానంలో ఉండగా, లైంగిక వేధింపులపై తిరుగుబాటు ఉద్యమం ’హాష్‌ట్యాగ్‌ మి టూ’కి మూడో ర్యాంక్‌ దక్కింది.  


 

మరిన్ని వార్తలు