కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

12 Aug, 2019 17:23 IST|Sakshi

ముంబై: జమ్మూకశ్మీర్‌, లదాఖ్‌ ప్రాంతాలలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని రిలయన్స్‌ సంస్థల అధినేత, సీఎండీ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అక్కడి ప్రజలకు కావాల్సిన వాటిపై, చేయవల్సిన అభివృద్దిపై ఇప్పటికే స్సెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ టాస్క్‌ఫోర్స్‌ పలు విషయాలపై అధ్యయనం చేస్తుందన్నారు. అక్కడి ప్రజలకు అవసరమైన, కశ్మీర్‌ అభివృద్దికి కావాల్సిన పరిశ్రమలను రిలయన్స్‌ స్థాపిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్దిలో భాగం కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో జమ్మూ, కశ్మీర్‌, లదాఖ్‌లలో రిలయన్స్‌ పెట్టుబడులకు సంబంధించిన మరిన్ని వార్తలను చూస్తారని ఈ సందర్భంగా అంబానీ వెల్లడించారు.

ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన అనంతరం తొలిసారి జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘మనమంతా కలిసి కొత్త జమ్మూకశ్మీర్, కొత్త లదాఖ్, కొత్త భారత దేశాన్ని నిర్మించి ప్రపంచానికి చూపిద్దాం. జమ్మూకశ్మీర్‌లో ఇక నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలు వస్తాయి, అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా సుందరమైన కశ్మీరంలో సినిమాలు తీయొచ్చు.. బాలీవుడ్, తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలను ఇక్కడ వారి సినిమాలు చిత్రీకరించాలని కోరుతున్నా’అంటూ మోదీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు