మహాభారత్‌ సహ నిర్మాతగా దేశ సంపన్నుడు

21 Mar, 2018 20:23 IST|Sakshi

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘మహాభారత్’  సినిమా సిరీస్‌కు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే ఈరోస్, ఏక్తా కపూర్‌కు చెందిన బాలాజీ టెలీ ఫిలింస్ లలో ముఖేష్ పెట్టుబడులు పెట్టారు. అయితే కొత్త సంస్థను స్థాపించడం ద్వారా ‘మహాభారత్’'కు ముఖేష్ పెట్టుబడులు పెడతారా? లేక ఇప్పటికే ఆయనకు ఉన్న మీడియా సంబంధిత సంస్థలు జియో, వయాకామ్ 18 ల ద్వారా పెట్టుబడులు పెడతారా? అనే విషయంలో స్పష్టత లేదు. నాలుగు నుంచి ఐదు భాగాలుగా ఈ సినిమా నిర్మితమవుతుందని తెలుస్తోంది. ఎక్కువ మంది దర్శకులు ఈ సినిమాకు పని చేసే అవకాశం ఉందని సమాచారం. ప్ర‌పంచంలోని సమారు అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం అందుతోంది. ప్రపంచ ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ రచయితలను ఇక్కడకు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అమీర్‌ ఖాన్‌ ఎక్కువగా కృషి చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు