రియల్టీలోకి ముకేశ్‌ అంబానీ!!

11 Apr, 2019 04:38 IST|Sakshi

ముంబై దగ్గర్లో మెగాసిటీ

ఐదు లక్షల మందికి నివాసం

పదేళ్లలో 75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: చౌక చార్జీల జియోతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ తాజాగా రియల్‌ ఎస్టేట్‌ రంగంపై దృష్టి పెడుతున్నారు. రియల్టీలో కూడా సంచలనం సృష్టించేలా సింగపూర్‌ తరహాలో భారీ మెగా సిటీకి రూపకల్పన చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దగ్గర్లో దీన్ని తలపెట్టినట్లు సమాచారం. ఈ మెగా సిటీ ప్రాజెక్ట్‌లో ప్రతీ విభాగం ఒక భారీ ప్రాజెక్టుగా ఉండనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాశ్రయం, పోర్టులకు కూడా దీన్ని అనుసంధానించనున్నట్లు వివరించాయి.

ఇది పూర్తయితే ఏకంగా అయిదు లక్షల మందికి నివాసం కాగలదని, వేల కొద్దీ వ్యాపార సంస్థలకు కేంద్రం కాగలదని పేర్కొన్నాయి. వచ్చే పదేళ్లలో దీనిపై దాదాపు 75 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని అంచనా. టెలికం రంగంలో జియోతో చౌక చార్జీల విప్లవం తీసుకొచ్చినట్లే ఈ ప్రాజెక్టులో అందుబాటు ధరల్లో, నాణ్యమైన ఇళ్లు అందించడంపై అంబానీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా దేశీయంగా పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల స్వరూపాన్ని సమూలంగా మార్చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.  

అభివృద్ధి.. నిర్వహణ కూడా ..
ఈ మెగా సిటీని అభివృద్ధి చేయడంతో పాటు దాని పరిపాలనకు సంబంధించి నిర్వహణపరమైన బాధ్యతలు కూడా రిలయన్సే చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్‌ తీసుకున్న స్పెషల్‌ ప్లానింగ్‌ అథారిటీ లైసెన్సు ఇందుకు ఉపయోగపడనుంది. ప్రాజెక్టులో నివాసితులకు ప్రభుత్వపరమైన అనుమతులు లభించడంలో జాప్యంతో పాటు ఇతరత్రా వ్యయాలు కూడా దీనివల్ల తగ్గగలవని అంచనా. సాధారణంగా ముంబై ఖరీదైన ప్రాంతం అయినప్పటికీ అవకాశాలరీత్యా భారీగా వలస వస్తుంటారు. అదే చౌక మెగా సిటీ గానీ పూర్తయితే రివర్స్‌లో ముంబై నుంచి కొత్త నగరానికి వలసలు పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

ధీరూభాయ్‌ కల..
వాస్తవానికి రిలయన్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీ 1980లలోనే ఇలాంటి ప్రపంచ స్థా యి నగరాన్ని నవీ ముంబైలో నిర్మించాలని తలపోశారు. తద్వారా దక్షిణ ముంబై, నవీ ముంబైలను రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించాలని భావిం చారు. ఒకవేళ ఇదే గానీ సాకారమై ఉంటే, ముంబైలో రద్దీ గణనీయంగా తగ్గి ఉండేదని విశ్లేషణ.

లీజుకు 4 వేల ఎకరాలు..
అంతర్జాతీయ స్థాయిలో ఎకనమిక్‌ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా నవీ ముంబై సెజ్‌ (ఎన్‌ఎంసెజ్‌) నుంచి దాదాపు 4,000 ఎకరాలు లీజుకు తీసుకున్నట్లు రిలయన్స్‌ ఇటీవలే ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 2,180 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ఈ ఎన్‌ఎంసెజ్‌లో ముకేశ్‌ అంబానీకి వాటాలు ఉండటం గమనార్హం. సుమారు పదిహేనేళ్ల క్రితమే ఈ భారీ ప్రాజెక్టుకు బీజం పడినట్లు భావించవచ్చు. ఎస్‌కేఐఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే సంస్థ చైనాలోని మెగా ఆర్థిక మండళ్ల (సెజ్‌) తరహాలో దేశీయంగా కూడా సెజ్‌ ఏర్పాటు చేసే లక్ష్యంతో 2000 నుంచి పెద్ద ఎత్తున స్థలాలను సమీకరిస్తోంది.

అప్పట్లో ఎస్‌కేఐఎల్‌ ఇన్‌ఫ్రా అధినేత నిఖిల్‌ గాంధీతో టాటా గ్రూప్‌ కూడా చేతులు కలిపేందుకు ప్రయత్నించింది కానీ.. ఇంతలో ముకేష్‌ అంబానీ ఆ అవకాశాన్ని అందుకున్నారు. 2005లో నిఖిల్‌ గాంధీతో చేతులు కలిపారు. ఎస్‌కేఐఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జై కార్ప్‌ ఇండియా, సిటీ అండ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్ప్‌ (సిడ్కో), ముకేష్‌లు కలిసి ఎన్‌ఎంసెజ్‌ను ఏర్పాటు చేశారు. 2006లో ప్రపంచ స్థాయి సెజ్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం దీనికి స్థలం కేటాయించింది. 2018లో మహారాష్ట్ర పారిశ్రామిక విధానం కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం.. సెజ్‌లకు కేటాయించిన స్థలాన్ని సమీకృత పారిశ్రామిక వాడగా మార్చేందుకు అనుమతులివ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఎన్‌ఎంసెజ్‌ కూడా దరఖాస్తు చేసుకోవడం, సెజ్‌ను ఐఐఏ కింద మార్చుకునేందుకు అనుమతులు తీసుకోవడం జరిగింది.
 

మరిన్ని వార్తలు