ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ షేర్ల హవా

17 Jun, 2020 13:45 IST|Sakshi

నెల రోజులుగా ర్యాలీ బాట..

46-98 శాతం మధ్య దూకుడు..

జాబితాలో కేబుల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్లు

ఆర్‌ఐఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ప్రా సైతం

గత నెల రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో గత నెల రోజుల్లో ఆటుపోట్ల మధ్య ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 8 శాతమే బలపడగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ఎంటర్‌టైన్‌మెంట్‌, మీడియా కంపెనీల షేర్లు 46-98 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఈ బాటలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ సైతం 12 శాతం స్థాయిలో పుంజుకోవడం గమనార్హం!

జియో ఎఫెక్ట్‌?
మొబైల్‌, డిజిటల్‌ సర్వీసుల అనుబంధ కంపెనీ రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు క్యూ కట్టినప్పటి నుంచీ మాతృ సంస్థ ఆర్‌ఐఎల్‌ జోరందుకుంది. జియో ఇన్ఫోకామ్‌లో 22 శాతం వాటా విక్రయంతో రూ. 1.04 లక్షల కోట్లను సమీకరించగా.. రైట్స్‌ ఇష్యూ ద్వారా ఆర్‌ఐఎల్‌ రూ. 53,000 కోట్లకుపైగా సమకూర్చుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో ప్రధాన కంపెనీ ఆర్‌ఐఎల్‌ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. ఇతర బిజినెస్‌ల విస్తరణపై దృష్టిసారించనున్నట్లు నిపుణలు పేర్కొంటున్నారు. దీంతో గ్రూప్‌లోని కంపెనీల షేర్లకు డిమాండ్‌ పెరిగినట్లు తెలియజేశారు.

జోరు తీరిలా
ముకేశ్‌ అంబానీ గ్రూప్‌లోని ఆర్‌ఐఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ గత నెల రోజుల్లో 11 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఫలితంగా ఆర్‌ఐఎల్‌ షేరు మంగళవారం(16న) రూ. 1648 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది కూడా. ఈ బాటలో ఇతర కౌంటర్లు మరింత జోరందుకున్నాయి. హాథవే భవానీ కేబుల్‌టెల్‌ 98 శాతం ఎగసి రూ. 16 నుంచి రూ. 32కు చేరింది. టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్‌ 75 శాతం జంప్‌చేసి రూ. 22 నుంచి రూ. 38కు ఎగసింది. నెట్‌వర్క్‌ 18 మీడియా రూ. 25 నుంచి రూ. 40కు చేరింది. ఇది 61 శాతం వృద్ధికాగా..డెన్‌ నెట్‌వర్క్స్‌ 53 శాతం పురోగమించి రూ. 80ను తాకింది. ఇదే విధంగా హాథవే కేబుల్‌ 46 శాతం పుంజుకుని రూ. 34ను అధిగమించగా.. రిలయన్స్‌​ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా 12 శాతం బలపడి రూ. 306కు చేరింది. 
 

మరిన్ని వార్తలు